హుస్నాబాద్, ఆగస్టు 14 (చైతన్యగళం): చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో డెంగ్యూ కేసు నమోదైన నేపథ్యంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రాజగోపాల్‌రావు గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. డెంగ్యూ బాధితుడి నివాసాన్ని పరిశీలించి, పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న స్ప్రేయింగ్ కార్యక్రమాలను తనిఖీ చేశారు. సిబ్బందితో మాట్లాడి యాంటీ లార్వల్ చర్యలు, స్ప్రేయింగ్‌కు అవసరమైన ద్రావణం తయారీ, వినియోగ విధానాన్ని సమీక్షించారు. డెంగ్యూ వ్యాప్తిని అరికట్టేందుకు కేసు నమోదైన ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెంటనే యాంటీ లార్వల్ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, దోమల వృద్ధికి అనుకూలమైన ప్రదేశాలను గుర్తించి నిర్మూలించాలని సూచించారు.
గ్రామంలో దోమల నియంత్రణ, వ్యాధి నిఘా చర్యల్లో భాగంగా హౌస్ ఇండెక్స్, బ్రెటో ఇండెక్స్, కంటైనర్ ఇండెక్స్‌లను క్రమం తప్పకుండా పరిశీలించి నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజలకు డెంగ్యూ నివారణపై అవగాహన కల్పిస్తూ పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకునేలా సూచించాలని తెలిపారు. వెక్టర్ నియంత్రణ చర్యలు, నిరంతర నిఘా, యాంటీ లార్వల్ ఆపరేషన్లు, పర్యవేక్షణను సమర్థవంతంగా నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ స్పష్టం చేశారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రసిల్లా, వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
