కరీంనగర్, ఆగస్టు 14 (చైతన్య గళం):
జిల్లాలో ఆరుతడి పంటల సాగును మరింత విస్తృతంగా ప్రోత్సహించేందుకు వ్యవసాయ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. రైతుల్లో అవగాహన కల్పించి ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ప్రోత్సహించాలని సూచించారు. గతేడాది జిల్లాలో సుమారు 6 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగు కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 16 వేల ఎకరాల్లో సాగు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆరుతడి పంటల విస్తీర్ణాన్ని మరింత పెంచేలా గ్రామాల వారీగా రైతులతో సమావేశాలు నిర్వహించి పంటల ప్రయోజనాలను వివరించాలని కలెక్టర్ ఆదేశించారు. మొక్కజొన్న, వేరుశనగ, ఆయిల్‌పామ్‌తో పాటు కూరగాయలు, పండ్ల తోటల సాగుపై రైతులను చైతన్యపరచాలని సూచించారు. పంటల ఎంపిక నుంచి సాగు విధానాల వరకు రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని వ్యవసాయ శాఖ సిబ్బందికి స్పష్టం చేశారు.
