- ఏకశిల ఏంజిల్స్, శ్రీ చైతన్య పాఠశాలల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
మహబూబాబాద్ :
మహబూబాబాద్ పట్టణంలోని ఏకశిల ఏంజిల్స్, శ్రీ చైతన్య పాఠశాలల్లో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించే స్వయం పరిపాలన దినోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు, పాఠశాల ఉన్నతాధికారుల పాత్రలను పోషిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు.
స్థానిక ఏకశిల ఏంజిల్స్ పాఠశాలలో నిర్వహించిన స్వయం పరిపాలన దినోత్సవంలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ సందర్భంగా డీఈఓగా కె. లక్ష్మీ ప్రసన్న, ఎంఈఓగా ఎల్. హర్పల్, చైర్మన్‌గా జి. నరేందర్, ప్రిన్సిపాల్‌గా ఆర్. సాయి మనోజ్, ఇన్‌చార్జిలుగా ఎం. అక్షిత, ఎ. మితుల్ బాధ్యతలు చేపట్టి పాఠశాల నిర్వహణలో భాగస్వాములయ్యారు.

అనంతరం జరిగిన కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి విద్యార్థి జీవితంలో ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరచుకుని, క్రమశిక్షణతో కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. అపజయాలకు భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. ఉపాధ్యాయులుగా బాధ్యతలు నిర్వహించిన విద్యార్థులను అభినందించి, ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు.
శ్రీ చైతన్య పాఠశాలలోనూ విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్రలను పోషిస్తూ తరగతి గదుల్లో పాఠాలు బోధించి తమ బోధనా నైపుణ్యాన్ని, నాయకత్వ ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ మదర్ మాట్లాడుతూ బాలల దినోత్సవం విద్యార్థుల్లో ఆనందంతోపాటు బాధ్యత, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించే సందర్భమని అన్నారు. చదువుతోపాటు వివిధ రంగాల్లో ప్రతిభను చాటుకుంటూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయుల పాత్రను పోషించడం ద్వారా బోధనలోని బాధ్యతలు, క్రమశిక్షణ, ఓర్పు వంటి విలువలను విద్యార్థులు తెలుసుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో ఏకశిల ఏంజిల్స్ పాఠశాల ప్రిన్సిపాల్ కె. రమేష్‌రెడ్డి, ఇన్‌చార్జిలు కె. మయూరి, ఐస్లీన్, ఉపాధ్యాయులు, శ్రీ చైతన్య పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

