- రాజకీయ పార్టీలకు బ్రాహ్మణ సంఘం నాయకుల విజ్ఞప్తి
హైదరాబాద్, అక్టోబరు 1 (చైతన్యగళం): రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని బ్రాహ్మణ సంఘం సీనియర్ నాయకులు వక్కలంక శ్రీనివాసరావు, చింతపల్లి మంగపతిరావు రాజకీయ పార్టీలను కోరారు. గురువారం సరూర్‌నగర్ డాక్టర్స్ కాలనీ డివిజన్‌లో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు.
శాసనమండలిలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి కనీసం ఒక స్థానమైనా కేటాయించాలని కోరారు. స్వాతంత్ర్య ఉద్యమంతో పాటు సమాజ వికాసానికి బ్రాహ్మణులు చేసిన సేవలను గుర్తు చేస్తూ, ప్రస్తుత రాజకీయాల్లో ఆ వర్గానికి తగిన ప్రాతినిధ్యం లేదని వారు పేర్కొన్నారు. నల్లగొండ–ఖమ్మం–వరంగల్, మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గాల్లో కనీసం ఒక స్థానాన్ని బ్రాహ్మణ సామాజిక వర్గానికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
గతంలో బ్రాహ్మణ అభ్యర్థులను ప్రజలు ఆదరించిన సందర్భాలు ఉన్నాయని వారు గుర్తుచేశారు. సమావేశంలో స్వరూప్‌రాజ్, పీవీఎల్ నారాయణరావు, ఉమాశంకర్‌రావు, యాదగిరిరావు తదితరులు పాల్గొన్నారు.
