Friday, September 11, 2026
Homeతెలంగాణకరీంనగర్సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలి

సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలి

📰 Generate e-Paper Clip

  • రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ డిమాండ్‌.. విమోచన స్మృతి కేంద్రాలు, భారీ మ్యూజియం ఏర్పాటు చేయాలి

కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 11 (చైతన్యగళం): సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్‌, మాజీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు డిమాండ్‌ చేశారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ తెలంగాణ ప్రాంతానికి 1948 సెప్టెంబర్‌ 17న స్వేచ్ఛ లభించిందని ఆయన పేర్కొన్నారు.

కరీంనగర్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజాం పాలనకు, రజాకార్ల దౌర్జన్యాలకు, జమీందారీ–జాగీర్దారీ దోపిడీకి వ్యతిరేకంగా ఎందరో రైతులు, మహిళలు, యువకులు పోరాడి ప్రాణత్యాగాలు చేశారని తెలిపారు. అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌ ఆదేశాలతో చేపట్టిన ‘ఆపరేషన్‌ పోలో’ అనంతరం 1948 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనమైందన్నారు.

గత ప్రభుత్వాలు సెప్టెంబర్‌ 17 ప్రాధాన్యాన్ని విస్మరించాయని సునీల్‌రావు విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అధికారికంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చిన బీఆర్‌ఎస్‌ కూడా పదేళ్ల పాలనలో దీనిని పట్టించుకోలేదని ఆరోపించారు. అప్పటి హైదరాబాద్‌ సంస్థానంలో భాగంగా ఉన్న మహారాష్ట్రలోని మరాఠ్వాడా, కర్ణాటక ప్రాంతాల్లో సెప్టెంబర్‌ 17ను ప్రభుత్వాలే అధికారికంగా నిర్వహిస్తున్నాయని, తెలంగాణలో మాత్రం అధికారికంగా నిర్వహించకపోవడం బాధాకరమన్నారు.

ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలివే

సెప్టెంబర్‌ 17న రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించి జాతీయ జెండా ఎగురవేయాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రాంతంలో ‘విమోచన స్ఫూర్తి’కి ప్రతీకగా ‘స్టాచ్యూ ఆఫ్‌ లిబరేషన్‌’ ఏర్పాటు చేయాలని కోరారు. ఆపరేషన్‌ పోలో, రజాకార్ల దురాగతాలు, తెలంగాణ విమోచన పోరాట చరిత్రను భవిష్యత్‌ తరాలకు తెలియజేసేలా భారీ మ్యూజియం నిర్మించాలని సూచించారు.

ప్రతి జిల్లా కేంద్రంలో తెలంగాణ విమోచన స్మృతి కేంద్రాలను ఏర్పాటు చేయాలని, పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అజ్ఞాత వీరుల వివరాలను సేకరించి అధికారికంగా అమరవీరుల జాబితా విడుదల చేసి గౌరవించాలని కోరారు. రజాకార్ల దురాగతాలకు బలైన గ్రామాలు, పోరాట ప్రాంతాల్లో స్మారక స్థూపాలు నిర్మించాలని, పరకాల వంటి చారిత్రక ప్రాంతాలను కలుపుతూ విమోచన పర్యాటక మార్గాన్ని అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు.

సెప్టెంబర్‌ 17 అధికారిక నిర్వహణ కోసం బీజేపీ గత 40 ఏళ్లుగా పోరాడుతోందని, రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈసారి అన్ని స్థాయిల్లో విమోచన వేడుకలు నిర్వహిస్తామని సునీల్‌రావు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.

సమావేశంలో బీజేపీ పార్లమెంట్‌ కన్వీనర్‌ బోయినిపల్లి ప్రవీణ్‌రావు, కార్పొరేటర్లు, కో ఆప్షన్‌ సభ్యులు, నాయకులు ఎన్నం ప్రకాష్‌, పొన్నం మొండయ్యగౌడ్‌, తేల్ల లక్ష్మి–రమేష్‌, సర్దార్‌ బల్వీర్‌సింగ్‌, గాజ శివరాం, బండారి వేణు, నాంపల్లి శ్రీనివాస్‌, కొలిపాక శ్రీనివాస్‌, బండ రమణారెడ్డి, మేకల వెంకటేష్‌, యువమోర్చా నాయకుడు సంఘం నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!