Friday, September 11, 2026
Homeతెలంగాణనల్గొండఎస్సీ, ఎస్టీ బాధితుల పరిహారం వెంటనే విడుదల చేయాలి

ఎస్సీ, ఎస్టీ బాధితుల పరిహారం వెంటనే విడుదల చేయాలి

📰 Generate e-Paper Clip

  • మూడేళ్లుగా పెండింగ్‌లో 102 కేసులు.. 180 మంది బాధితులకు చెల్లింపులు చేయాలి
  • కులాంతర వివాహితుల ప్రోత్సాహక నగదు బకాయిలను తక్షణమే చెల్లించాలి: కేవీపీఎస్

నల్లగొండ, సెప్టెంబర్‌ 11 (చైతన్యగళం): జిల్లాలో గత మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీల దౌర్జన్యాల నిరోధక చట్టం కింద నమోదైన 102 కేసుల్లోని 180 మంది బాధితులకు ప్రభుత్వం చెల్లించాల్సిన పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్‌) రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలడుగు నాగార్జున డిమాండ్‌ చేశారు. అలాగే కులాంతర వివాహం చేసుకున్న 250 జంటలకు ప్రభుత్వం అందించాల్సిన రూ.2.50 లక్షల ప్రోత్సాహక నగదు బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరారు.

డిమాండ్ల సాధనకు కేవీపీఎస్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా డీఆర్వో దశరథ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ దౌర్జన్యాల కేసుల్లో బాధితులైన కుటుంబాలకు చట్ట ప్రకారం అందాల్సిన పరిహారం మూడేళ్లుగా పెండింగ్‌లో ఉండటంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. బాధితుల్లో అధిక శాతం పేద, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలేనని, సకాలంలో పరిహారం అందక ఆర్థిక భారం మరింత పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

చట్టం ప్రకారం వివిధ దశల్లో అందాల్సిన పరిహారాన్ని వెంటనే విడుదల చేసి అర్హులైన ప్రతి బాధితుడికి అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా కుల వ్యవస్థ నిర్మూలన, సామాజిక సమానత్వానికి కులాంతర వివాహాలు దోహదపడుతున్నాయని, వాటిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయం కూడా మూడేళ్లుగా పెండింగ్‌లో ఉండటం బాధాకరమన్నారు. ప్రోత్సాహక నగదు కోసం లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సరైన స్పందన లభించడం లేదని తెలిపారు.

జిల్లా కలెక్టర్‌ ప్రత్యేకంగా జోక్యం చేసుకుని పెండింగ్‌ కేసులపై సమీక్ష నిర్వహించాలని, అర్హులైన బాధితులకు పరిహారం, కులాంతర వివాహితులకు ప్రోత్సాహక నగదును వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని నాగార్జున డిమాండ్‌ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి నిధులు పెండింగ్‌ కాకుండా సకాలంలో విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

కార్యక్రమంలో కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను, ఉపాధ్యక్షులు గాదె నరసింహ, ఒంటెపాక కృష్ణ, సహాయ కార్యదర్శులు బొల్లు రవీంద్రకుమార్‌, కోడిరెక్క మల్లన్న, జిల్లా కమిటీ సభ్యులు దైద శ్రీను, దంతాల నాగార్జున, దైదా దేవయ్య, బొల్లంపల్లి పాపారావు, దున్న అచ్చాలు, బొంగరాల వెంకటయ్య, మాతంగి రవికుమార్‌, దోరేపల్లి మల్లయ్య, వెంకట్‌, బండి నారాయణ, లింగస్వామి, ధనరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!