సిద్దిపేట, సెప్టెంబర్ 1(చైతన్యగళం(:
భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో ఎస్‌ఐఆర్–2026లో భాగంగా జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల ముసాయిదా ఓటరు జాబితాపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1,175 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ఓటరు జాబితా ప్రకారం 4,28,861 మంది పురుషులు, 4,45,273 మంది మహిళలు, 47 మంది ఇతర లింగ ఓటర్లతో కలిపి మొత్తం 8,74,181 మంది ఓటర్లు ఉన్నట్లు వివరించారు ఓటరు జాబితాలో అసాధారణంగా ఉన్న 1,99,179 మంది, మ్యాపింగ్ లేని 27,254 మంది ఓటర్లను గుర్తించినట్లు తెలిపారు. మొత్తం 2,26,433 మందికి నోటీసులు జారీ చేయగా, ఇప్పటివరకు 1,11,223 మందికి నోటీసులు అందజేసినట్లు పేర్కొన్నారు. అభ్యంతరాలు, వినతులు, వివరణలు సమర్పించేందుకు అవకాశం కల్పిస్తూ ఆగస్టు 31 నాటికి 4,778 మంది ఓటర్లపై విచారణ నిర్వహించినట్లు తెలిపారు మ్యాపింగ్ లేని ఓటర్లకు అందిన నోటీసులకు అనుగుణంగా తమ వివరాలను ధ్రువీకరించేందుకు ఎన్నికల సంఘం సూచించిన పత్రాలను సమర్పించాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ ఉద్యోగుల గుర్తింపు కార్డు, పింఛన్ చెల్లింపు ఉత్తర్వు, జనన ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్ట్, విద్యార్హత ధ్రువీకరణ పత్రం, శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం తదితర 12 రకాల పత్రాలను సమర్పించే అవకాశం ఉందని తెలిపారు ఎస్‌ఐఆర్‌లో భాగంగా అభ్యంతరాలు, వినతులు స్వీకరించేందుకు ఈ నెల 5, 6 తేదీల్లో, తిరిగి 12, 13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ప్రచార దినోత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఏఈఆర్‌ఓల వద్ద నిర్వహించే కార్యక్రమాలకు హాజరుకాని ఓటర్ల కోసం మరోసారి ఈఆర్‌ఓల ద్వారా ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ నిర్వహించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు కోరారు. ఓటరు జాబితాలో పాత ఫొటోలు ఉన్నాయని, వాటి స్థానంలో కొత్త ఫొటోలు నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్‌ను కోరారు సమావేశంలో ఎన్నికల సూపరింటెండెంట్ చంద్రశేఖర్, బీజేపీ ప్రతినిధులు బైరి శంకర్, పి. రాజు, వెంకట్ రెడ్డి, జ్యోతి రెడ్డి, బీఆర్‌ఎస్ ప్రతినిధి మోహన్ లాల్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు అంజయ్య, బాబు, శివకుమార్, ఏఐఎంఐఎం ప్రతినిధి మునీర్ తదితరులు పాల్గొన్నారు.