భీమదేవరపల్లి, ఆగస్టు 27 (చైతన్య గళం): వివాహ వేడుకకు హాజరై స్వగ్రామానికి తిరిగి వెళ్తున్న కుటుంబ సభ్యుల కారుకు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన కారు రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లడంతో ఓ మహిళ మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం రాంనగర్ (మంగళపల్లి) శివారు ప్రాంతంలో చోటుచేసుకుంది కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్‌కు చెందిన ఏలూరి రవీందర్‌రెడ్డి, ఏలూరి వీరారెడ్డి, చిట్టి కిరణ్, ఏలూరి రాధ (61) హుస్నాబాద్ మండలం పోతారం గ్రామంలోని శుభం గార్డెన్స్‌లో జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యారు. అనంతరం కారులో తిరుగు ప్రయాణమయ్యారు. రాంనగర్ (మంగళపల్లి) శివారుకు చేరుకోగానే వాహనం అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది ప్రమాద తీవ్రతకు ఏలూరి రాధ అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
