సిద్ధిపేట, జూలై 31(చైతన్యగళం):
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి ఆగస్టు 15 నాటికి ఒక జత యూనిఫామ్ తప్పనిసరిగా అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు శుక్రవారం వర్గల్ మండల కేంద్రంలోని మండల మహిళా సమాఖ్య భవనంలో స్కూల్ యూనిఫామ్ కుట్టింపు కార్యక్రమంలో భాగంగా క్లాత్ కటింగ్ ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వర్గల్ మండలంలోని 3,830 మంది విద్యార్థులకు యూనిఫామ్‌ల తయారీ కోసం హైదరాబాద్ నుంచి వచ్చిన వస్త్రాన్ని సరైన కొలతలతో కట్ చేయాలని సూచించారు. క్లాత్ వృథా కాకుండా నిర్దిష్ట పరిమాణంలో కటింగ్ చేసి, వెంటనే మండలంలోని గ్రామాల స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలకు అందజేయాలని ఏపీఎంను ఆదేశించారు యూనిఫామ్‌ల కుట్టింపు పనులను వేగవంతంగా పూర్తి చేసి, విద్యార్థులకు పరిశుభ్రంగా, సౌకర్యవంతంగా ఉండేలా నాణ్యతతో కుట్టాలని మహిళలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం కిరణ్ కుమార్, సీసీలు, మహిళా సమాఖ్య అధ్యక్షులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.