కరీంనగర్, జూలై 30 (చైతన్యగళం):
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
జిల్లా కేంద్రంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, ఫోన్ నెంబర్ 8782997247ను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని సూచించారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే ఈ నంబర్‌కు సమాచారం అందించాలని ఆదేశించారు.
* మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీఓలు పాత, శిథిలావస్థలో ఉన్న భవనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
* అవసరమైన చోట్ల జేసీబీలు, రెస్క్యూ వాహనాలు సిద్ధంగా ఉంచాలని, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
* వైద్యాధికారులు సీజనల్ వ్యాధులకు మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, అత్యవసర వైద్య సేవలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
* పంచాయతీరాజ్ శాఖ, ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు రహదారులు, వంతెనలు, కల్వర్టులు, మౌలిక సదుపాయాల నష్టంపై నివేదికలు సమర్పించాలని చెప్పారు.
* వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖ అధికారులు పంట నష్టాలు నమోదు చేసి, పశువుల రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రమాదకరంగా పారుతున్న నీటి కాలువల వద్ద బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని, మండల స్థాయి అధికారులు ముందస్తు అనుమతి లేకుండా సెలవులో వెళ్లరాదని, హెడ్‌క్వార్టర్స్‌లో తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
పాఠశాలలు, అంగన్‌వాడీలు, ఆరోగ్య కేంద్రాలను ప్రత్యేకంగా పర్యవేక్షించి, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
