వరంగల్, జూలై 20 (చైతన్యగళం):
హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ స్థాయి విస్తృత సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, “ప్రతి అర్హత కలిగిన ఓటును కాపాడటమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ప్రతి బూత్ లెవల్ ఏజెంట్ (BLA) ఇంటింటికీ వెళ్లి గడప గడప ప్రచారం నిర్వహించి ఓటర్ల వివరాలను పరిశీలించి అవసరమైన సవరణలు చేయించాలి” అని సూచించారు.
సమావేశానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, సర్ వరంగల్ పార్లమెంట్ ఇన్‌చార్జ్ నాసీర్ అహ్మద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ, “ఓటర్ల జాబితాలో పేరు లేకపోవడం, తప్పులు ఉండడం, చిరునామా మార్పులు, మరణించిన వారి ఓట్లు వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి సవరణలు చేయాలి. అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా కాపాడడమే మా లక్ష్యం. పార్టీ కోసం కష్టపడే వారికే గుర్తింపు, అవకాశాలు, పదవులు లభిస్తాయి” అని స్పష్టం చేశారు.
అతను మరింతగా మాట్లాడుతూ, “కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత రెండేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అనేక సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేసింది. ప్రజా సంక్షేమం, అభివృద్ధే మా ప్రభుత్వ లక్ష్యం. రాబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం ఖాయం” అని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇ.వి. శ్రీనివాస్ రావు, డివిజన్ ఇన్‌చార్జ్‌లు, మాజీ కార్పొరేటర్లు, బూత్ ఇన్‌చార్జ్‌లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
