మహబూబాబాద్, జూలై 2(చైతన్యగళం): బాల్య వివాహాలు బాలికల భవిష్యత్తును దెబ్బతీసే సామాజిక సమస్య అని, వాటిపట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్యానెల్ న్యాయవాదులు కమల్ కుమార్, సునీత సూచించారు. మహబూబాబాద్ పట్టణంలోని స్థానిక బాలల సదనంలో నిర్వహించిన న్యాయ అవగాహన కార్యక్రమంలో వారు పాల్గొని విద్యార్థులతో మాట్లాడారు. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో పిల్లలందరూ క్రమం తప్పకుండా పాఠశాలలకు హాజరై విద్యను అభ్యసించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని కోరారు.
చదువే భవిష్యత్తును మార్చే ప్రధాన సాధనమని పేర్కొంటూ, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి పట్టుదలతో విద్యను కొనసాగించాలని పిల్లలకు సూచించారు. పాఠశాల ఆవరణలో గానీ, పాఠశాలకు వెళ్లే మార్గంలో గానీ ఎవరైనా వేధింపులకు పాల్పడితే మౌనంగా ఉండకుండా వెంటనే సదనం నిర్వాహకులు, ఉపాధ్యాయులు, పోలీసు శాఖ లేదా జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. చట్టం ఎల్లప్పుడూ బాధితులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాల్య వివాహాల బారిన పడే పరిస్థితులు ఎదురైనా ధైర్యం కోల్పోకుండా విద్యపై దృష్టి సారించి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో బాలల సదనం సూపరింటెండెంట్ ధనలక్ష్మి పాల్గొన్నారు.
