టెట్ అర్హత మార్కులను అందరికీ 40 శాతంగా నిర్ణయించాలి: తపస్ నాయకులు
యాచారం, ఆగస్టు 18 (చైతన్యగళం): ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని తపస్ రాష్ట్ర బాధ్యులు కాయల శ్రీనివాస్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పూజారి రమేశ్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా తపస్ యాచారం మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ అభియాన్ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు.
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం తపస్ ఆధ్వర్యంలో ఆగస్టు 1న రాష్ట్ర మహాధర్నా నిర్వహించామని, ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. అయినప్పటికీ ప్రధాన సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని పేర్కొన్నారు.
ప్రభుత్వం ఇకనైనా స్పందించి పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను మంజూరు చేయడంతో పాటు పెండింగ్ డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను అమలు చేయాలని కోరారు.
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు, కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని నాయకులు కోరారు. 2010కు ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, టెట్ అర్హత మార్కులను అందరికీ 40 శాతంగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు.
మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు 2008 డీఎస్సీ ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. విద్యారంగం బలోపేతానికి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కీలకమని వారు పేర్కొన్నారు.
కార్యక్రమంలో తపస్ మండల అధ్యక్షుడు సూదిని విజేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వస్పరి మల్లేష్, జిల్లా బాధ్యులు మహిపాల్‌రెడ్డి, మండల కోశాధికారి శ్రీరామ్‌రెడ్డి, మండల మహిళా కన్వీనర్ స్వరూప, ఉపాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, మండల కార్యదర్శులు కావలి రాజు, ప్రియ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
