వెల్దండ, ఆగస్టు 17 (చైతన్యగళం): వెల్దండ మండల తహశీల్దార్ కార్తీక్ కుమార్ ఉత్తమ తహశీల్దార్గా అవార్డు అందుకున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పుట్ట రామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కల్వకుర్తి మాజీ మార్కెట్ చైర్మన్ విజితా రెడ్డితో కలిసి కార్తీక్ కుమార్ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా పుట్ట రామిరెడ్డి మాట్లాడుతూ.. వెల్దండ మండల తహశీల్దార్గా కార్తీక్ కుమార్ రెవెన్యూ శాఖలో నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ ప్రజల మన్ననలు పొందారని కొనియాడారు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆగస్టు 15న ఉత్తమ తహశీల్దార్ అవార్డుతో సత్కరించడం అభినందనీయమన్నారు. ప్రణాళిక సంఘం చైర్మన్ చిన్నారెడ్డి, ఎంపీ డాక్టర్ మల్లు రవి, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం వెల్దండ మండలానికి గర్వకారణమని పేర్కొన్నారు. ప్రజలకు అంకితభావంతో సేవలందించే ఇలాంటి అధికారి మండలంలో విధులు నిర్వహించడం అభినందనీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో వెల్దండ మాజీ ఉపసర్పంచ్ జంగిలి నిరంజన్, కల్వకుర్తి మార్కెట్ చైర్మన్ విజితా రెడ్డి, మాజీ ఎంపీటీసీలు జ్యోతినిరంజన్, నాగుల నాయక్, లింగం, బీఆర్ఎస్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు నాగయ్య, జంగిలి యాదగిరి, ఆనంద్ కుమార్, జంగిలి ప్రవీణ్, గ్రామ వార్డు సభ్యుడు శేఖర్, టైలర్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
