మర్రిగూడ, సెప్టెంబర్ 11 (చైతన్యగళం): మైనర్ బాలిక మృతికి కారణమైన వారిని అరెస్టు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు శుక్రవారం మర్రిగూడ పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.
మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక వరికుప్పల మౌనిక ఈ నెల 2న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అదే రోజు బాలిక తండ్రి వరికుప్పల శ్రీనివాస్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన ఏర్పుల రాకేష్, దామెర శివ వేధింపుల కారణంగానే తన కుమార్తె మృతి చెందిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఘటన జరిగి పది రోజులు గడిచినా నిందితులను అరెస్టు చేయకపోవడంపై కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
