- రైతు కమిషన్‌ను ఆశ్రయించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులు
హైదరాబాద్, సెప్టెంబరు 1 (చైతన్యగళం): సాయాజీ సీడ్స్ కంపెనీ విత్తనాలతో పంటలు సాగుచేసి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన రైతులు తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ను ఆశ్రయించారు. మంగళవారం హైదరాబాద్‌లోని రైతు కమిషన్ కార్యాలయంలో కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి, సభ్యులు కే.వీ.ఎన్.రెడ్డి, గోపాల్‌రెడ్డిలను కలిసి వినతిపత్రం సమర్పించారు.
2024–25 సంవత్సరంలో కంపెనీ ప్రతినిధులు, ఆర్గనైజర్ల సూచనల మేరకు సంకరజాతి వరి విత్తనాలను సాగు చేసినప్పటికీ ఎకరానికి కేవలం 2 నుంచి 4 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చిందని రైతులు తెలిపారు. దీంతో తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. దిగుబడి తగ్గితే నష్టపరిహారం చెల్లిస్తామని కంపెనీ ప్రతినిధులు హామీ ఇవ్వడంతో పండించిన పంటను కంపెనీకి అప్పగించామని, అయితే ఏడాది గడిచినా పరిహారం చెల్లించకుండా వాయిదాలు వేస్తున్నారని ఆరోపించారు.
ఇతర విత్తన కంపెనీలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు నష్టపరిహారం చెల్లించినప్పటికీ సాయాజీ సీడ్స్ సంస్థ మాత్రం తమకు ఎలాంటి పరిహారం అందించలేదని రైతులు తెలిపారు. ఎరువులు, పురుగు మందులు, వరి కోత యంత్రం, రోగింగ్ ఛార్జీలు చెల్లిస్తామని హామీ ఇచ్చి వాటినీ చెల్లించలేదని ఫిర్యాదు చేశారు. రా సీడ్‌కు తూకం ప్రకారం ధర చెల్లిస్తామని చెప్పి 10 శాతం తరుగు తీసుకున్నారని ఆరోపించారు.సమస్యపై కంపెనీ ప్రతినిధులతో చర్చించేందుకు అహ్మదాబాద్‌లోని సంస్థ కార్యాలయానికి వెళ్లిన ఐదుగురు రైతులను సెక్యూరిటీ సిబ్బంది ద్వారా బయటకు పంపించారని రైతులు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 18 నుంచి 20 గ్రామాలకు చెందిన సుమారు 230 మంది రైతులు దాదాపు 480 ఎకరాల్లో పంట నష్టపోయినట్లు వివరించారు.
ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, పంట నష్టాన్ని శాస్త్రీయంగా అంచనా వేసి బాధిత రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కమిషన్‌ను కోరారు.రైతుల ఫిర్యాదులను సావధానంగా విన్న కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి, సభ్యులు కే.వీ.ఎన్.రెడ్డి, గోపాల్‌రెడ్డి స్పందిస్తూ వ్యవహారంపై విచారణ చేపట్టి బాధిత రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.