Tuesday, August 4, 2026
Homeతెలంగాణఆకుతోటపల్లి క్వారీలపై మళ్లీ రగిలిన నిరసన

ఆకుతోటపల్లి క్వారీలపై మళ్లీ రగిలిన నిరసన

📰 Generate e-Paper Clip

  • అదనపు కలెక్టర్‌కు మరోసారి వినతి..
  • సమగ్ర విచారణ జరిపి అనుమతులు రద్దు చేయాలని గ్రామస్థుల డిమాండ్

ఆమనగల్లు, ఆగస్టు 3 (చైతన్యగళం):
ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామంలోని సర్వే నంబర్లు 302, 304లో ప్రతిపాదిత క్వారీలు, స్టోన్ క్రషర్ల ఏర్పాటుపై గ్రామస్థుల నిరసన మరింత ఉధృతమైంది. గ్రామ ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా అనుమతుల ప్రక్రియ కొనసాగుతుందంటూ సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్మయి కు మరోసారి కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ, గ్రామ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని క్వారీలు, స్టోన్ క్రషర్ల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయవద్దని కోరారు. జూలై 31న నిర్వహించిన సంయుక్త తనిఖీలో గ్రామ ప్రజల అభిప్రాయాలు పూర్తిస్థాయిలో నమోదు కాలేదని, మండల రెవెన్యూ అధికారి (ఎంఆర్వో) తనిఖీలో పాల్గొనకపోవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపాదిత క్వారీలకు సమీపంలో ప్రభుత్వ పాఠశాల, సుమారు 800 మీటర్ల దూరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండటంతో బ్లాస్టింగ్, ధూళి, శబ్ద కాలుష్యం కారణంగా విద్యార్థులు, రోగులు, గర్భిణీలు, చిన్నారులు, వృద్ధులు, వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు. అదేవిధంగా భారీ లారీల రాకపోకలతో రోడ్డు ప్రమాదాలు పెరగడమే కాకుండా గ్రామంలో కాలుష్య సమస్యలు తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామ ప్రజల అభ్యంతరాలు, పర్యావరణ ప్రభావం, ప్రజారోగ్య అంశాలపై అన్ని శాఖల అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ నిర్వహించాలని కోరారు. గ్రామస్థుల వినతిపై స్పందించిన అదనపు కలెక్టర్ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌తో నేరుగా మాట్లాడి పూర్తి వివరాలు కోరినట్లు తెలిసింది. రెవెన్యూ, మైన్స్ అండ్ జియాలజీ, కాలుష్య నియంత్రణ మండలి, విద్యాశాఖ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వాస్తవ పరిస్థితులను పరిశీలించి గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!