నల్లగొండ, ఆగస్టు 1 (చైతన్యగళం):
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, భూస్వాములను, నిజాం రజాకార్లను తరిమిన మహావీరుడు కాచం కృష్ణమూర్తి అని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయ్య పేర్కొన్నారు.శనివారం నల్లగొండలోని దొడ్డి కొమురయ్య భవనంలో కాచం కృష్ణమూర్తి 20వ వర్ధంతి ఘనంగా జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, “కృష్ణమూర్తి గారు పీడిత ప్రజల పక్షాన నిలిచి, వీర తెలంగాణ సాయుధ పోరాటంలో సముచిత పాత్ర పోషించారు. దొరలను, జాగిందారులను తరిమి, దున్నేవాడికి భూమి పంచి వేలాది గ్రామాల ప్రజలకు విముక్తి కలిగించారు. గ్రామీణ పేదలకు, వ్యవసాయ కూలీలకు అండగా నిలిచారు” అని గుర్తుచేశారు.నేటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కార్మిక–కర్షక వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. రోజుకు కనీసం రూ.700 కూలి ఇవ్వకుండా, ఫోటో క్యాప్చర్ వంటి ఇబ్బందికర నిబంధనలతో కూలీలను వేధించడం సిగ్గుచేటని అన్నారు.నేటి తరానికి కృష్ణమూర్తి జీవితం ఆదర్శమని, ఆయన నడిచిన పోరుబాటలో ప్రజలను చైతన్యం చేస్తూ కష్టజీవుల రాజ్య స్థాపన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 10న జైల్ భరో కార్యక్రమంను సిఐటియు, రైతు–వ్యవసాయ కార్మిక సంఘాలు నిర్వహిస్తున్నాయని, కార్మికులు, కర్షకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పాలడుగు నాగార్జున, సయ్యద్ హషం, పాలడుగు ప్రభావతి, దండంపల్లి సరోజ, గండమల్ల రాములు, దండంపల్లి సత్తయ్య, పుచ్చకాయల నర్సిరెడ్డి, పింజర్ల సైదులు, గంజి మురళీధర్, కొండ అనురాధ, మల్లం మహేష్, నలపరాజు సైదులు, బూర జానయ్య, గుండాల నరేష్, రుద్రాక్ష యాదయ్య, కండే యాదగిరి, కొండ వెంకన్న, పనస చంద్రయ్య, సీత వెంకటయ్య, రుద్రాక్ష శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
