CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 8:09 pm Posted by : CHAITHANYA GALAM NEWS

వెదురు ఉత్పత్తులతో ఉపాధి అవకాశాలు

నాగర్‌కర్నూల్‌, సెప్టెంబర్‌ 18 (చైతన్యగళం‌): వెదురు వనరులతో ఉపాధి, ఆదాయ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ బి.చెన్నయ్య సూచించారు. అంతర్జాతీయ వెదురు దినోత్సవం సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వెదురు ఉత్పత్తుల ప్రదర్శనను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. వెదురుతో గృహోపకరణాలు, అలంకరణ వస్తువులు తదితర ఉత్పత్తులు తయారు చేసి ఉపాధి పొందవచ్చన్నారు. సంప్రదాయ కళాకారుల నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ ఆధునిక రూపకల్పనలు, నాణ్యత, మార్కెటింగ్‌పై దృష్టి సారించాలని సూచించారు. వెదురు ఆధారిత ఉత్పత్తుల ప్రోత్సాహంతో పర్యావరణ పరిరక్షణతో పాటు కళాకారులకు మెరుగైన జీవనోపాధి కల్పించవచ్చన్నారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, వెదురు కళాకారులు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.