అత్యవసర వైద్య సేవల నాణ్యతపై సమీక్ష
సిరిసిల్ల, జూన్ 10 (చైతన్యగళం):రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిలిపి ఉంచిన 108 అత్యవసర అంబులెన్స్ వాహనాలను ప్రోగ్రామ్ మేనేజర్ భూమా నాగేందర్, జిల్లా మేనేజర్ అరుణ్ కుమార్ కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా అంబులెన్స్‌లలో అందుబాటులో ఉండాల్సిన అత్యవసర వైద్య పరికరాలు, మందులు, ఆక్సిజన్ సిలిండర్లు, పరిశుభ్రత, వాహనాల నిర్వహణ, సిబ్బంది హాజరు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బంది విధుల నిర్వహణ, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే తీరు, ప్రజలకు అందిస్తున్న సేవల నాణ్యతను సమీక్షించారు.
సిరిసిల్ల జిల్లాలో 108 సిబ్బంది అందిస్తున్న సేవలు, వాహనాల నిర్వహణను పరిశీలించిన అనంతరం అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన అత్యవసర వైద్య సేవలు అందించడంలో సిబ్బంది మరింత అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రతి నిమిషం విలువైనదని, అందువల్ల అన్ని అంబులెన్స్‌లు ఎల్లప్పుడూ సన్నద్ధంగా ఉండేలా చూడాలని, ప్రజలకు 24 గంటల పాటు నిరంతరాయంగా మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు.
ఈ తనిఖీల ద్వారా సేవల నాణ్యతను మరింత మెరుగుపరచడంతో పాటు ప్రజల్లో 108 సేవలపై విశ్వాసాన్ని పెంపొందించడమే ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిబ్బంది పెద్ది శ్రీనివాస్, జలగం సత్యసాగర్, పడ్నాల అనిల్ కుమార్, భత్తుల రాజు, మొగిలి సుధాకర్, యాడారం స్వామి, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.