విజయవాడ, జూన్ 14(చైతన్యగళం): మాజీ ఎంపీ కేశినేని నాని ఇటీవల చేసిన వ్యాఖ్యలపై విజయవాడ ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్ని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాని ఆరోపణలకు దీటుగా కౌంటర్ ఇచ్చిన చిన్ని.. ఆయన భారీ అవినీతికి పాల్పడ్డారంటూ సంచలన విషయాలను బయటపెట్టారు. కేశినేని నాని బ్యాంకు అధికారులను ప్రలోభపెట్టి ఏకంగా రూ.120 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. మీడియాతో మాట్లాడిన కేశినేని చిన్ని.. నాని ఆర్థిక అక్రమాలను ఎండగట్టారు. సాధారణంగా ఎవరైనా బ్యాంకుకు చెల్లించాల్సిన మూడో వాయిదా కట్టకపోతే తక్షణమే ఆస్తులను సీజ్ చేస్తారని, కానీ నాని విషయంలో అలా జరగలేదని గుర్తుచేశారు. వాయిదాలు చెల్లించకపోయినా బ్యాంకు అధికారులు ఆయన ఆస్తులను ఎందుకు సీజ్ చేయలేదని చిన్ని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ.. ‘నానీ నేషనలైజ్ బ్యాంకులో రూ.120 కోట్ల రుణం తీసుకుని మోసం చేశారు. 2016-17 లో ఈ రుణం NPA అయ్యింది. ఆటో డ్రైవర్లు మూడో వాయిదా కట్టక పోతేనే ఆటో సీజ్ చేస్తారు. మరి 11 యేళ్లుగా బ్యాంకు అధికారులు అప్పు ఎందుకు వసూలు చేయలేదు?. ఇంత పెద్ద స్కామ్ జరిగిన తర్వాత కూడా నాని బ్యాంకు అధికారులను మభ్యపెట్టారు. ఈ కుంభకోణంలో బ్యాంకు అధికారుల తీరు కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది. 2019లో వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డిని కేశినేని నాని తన ఇంటికి ఎందుకు పిలిపించుకున్నారు. నానీ రూ.120 కోట్ల స్కామ్ నుంచి బయటపడటానికే వైసీపీతో డీల్ కుదుర్చుకున్నారు. నా వద్ద అతని అవినీతికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆంధ్రా విజయ మాల్యా గా మారిన నానీ.. నా మీద సోషల్ మీడియాలో ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది. నేను అన్ని ఆధారాలు ఇచ్చాను… మీడియా కూడా వాస్తవాలు తెలుసుకుని రాయండి’ అని అన్నారు.