CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 27 November 2026, 8:35 am Posted by : CHAITHANYA GALAM NEWS

విద్యార్థులు రాజ్యాంగ విలువలను అలవర్చుకోవాలి

  • సిద్దిపేట జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మాధవరావు పిలుపు

హుస్నాబాద్‌, నవంబర్ 26 (చైతన్యగళం): విద్యార్థులు రాజ్యాంగ విలువలను అవగాహన చేసుకుని, వాటిని తమ జీవితాల్లో అలవర్చుకోవాలని సిద్దిపేట జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మాధవరావు పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా హుస్నాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ బాలుర కళాశాలలో జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాధవరావు మాట్లాడుతూ.. 1949 నవంబర్‌ 26న రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిందని తెలిపారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ అధ్యక్షతన పనిచేసిన ముసాయిదా కమిటీ దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించే రాజ్యాంగాన్ని రూపొందించిందని కొనియాడారు. విద్యార్థులు ప్రాథమిక హక్కులతో పాటు ప్రాథమిక విధులనూ బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని సూచించారు. ఇంటర్మీడియట్‌ స్థాయి నుంచే రాజ్యాంగ విలువలపై అవగాహన పెంపొందించుకుంటే నాయకత్వ లక్షణాలు అలవడి, దేశాభివృద్ధిలో భాగస్వాములు కాగలరని పేర్కొన్నారు.

కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి ఆయన రాజ్యాంగ పీఠికను పఠించారు. దేశ సమగ్రతను కాపాడేందుకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అధ్యాపకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, రానున్న వార్షిక పరీక్షలకు సంబంధించి 45 రోజుల ప్రణాళికను అమలు చేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని మరింత పెంచాలని, ఈ ఏడాది వార్షిక పరీక్షల ఫలితాల్లో సిద్దిపేట జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు సమష్టిగా కృషి చేయాలని కోరారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ప్రణాళికాబద్ధంగా చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ సీహెచ్‌ గంగాధర్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారి టి. రణధీర్‌ కుమార్‌, అధ్యాపకులు వి. రజనీ, ఎస్‌. సత్యనారాయణ, వి. సదాశివ్‌, బి. ఎల్లయ్య, ఎస్‌. వెంకట ముత్యం, బి. వాల్య, సీహెచ్‌ విద్యాసాగర్‌, పి. చంద్రమోహన్‌, సీహెచ్‌ రాజిరెడ్డి, ఎస్‌. అశోక్‌, గ్రంథపాలకురాలు ఆర్‌. వాసవి, ఏ. మమత, ఆర్‌. వెంకటేష్‌, అధ్యాపకేతర సిబ్బంది వెంకట సాయి, శ్వేత, విద్యార్థులు పాల్గొన్నారు.