CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 27 November 2026, 8:31 am Posted by : CHAITHANYA GALAM NEWS

దీక్షా దివస్‌ సభ వాల్‌ పోస్టర్ల ఆవిష్కరణ

  • ఈ నెల 29న అలుగునూర్‌లో భారీ బహిరంగ సభ.. పెద్ద సంఖ్యలో తరలిరావాలని బీఆర్‌ఎస్‌ నాయకుల పిలుపు

హుస్నాబాద్‌, నవంబర్ 26 (చైతన్యగళం): సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఈ నెల 29న కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం అలుగునూర్‌లో నిర్వహించనున్న దీక్షా దివస్‌ భారీ బహిరంగ సభకు సంబంధించిన వాల్‌ పోస్టర్లను బీఆర్‌ఎస్‌ నాయకులు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రెండు దశాబ్దాల పాటు సుదీర్ఘ పోరాటం చేసి, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విశేష కృషి చేశారని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అలుగునూర్‌ వద్ద పోలీసులు కేసీఆర్‌ను అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించిన సందర్భంలో ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ఉద్యమ ఆకాంక్షను మరింత ముందుకు తీసుకెళ్లారని పేర్కొన్నారు.

ఆ చారిత్రక ఘట్టాన్ని స్మరించుకుంటూ ఈ నెల 29న అలుగునూర్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు పార్టీ కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమ అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.