CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 21 November 2026, 4:58 pm Posted by : CHAITHANYA GALAM NEWS

బ్రెయిన్‌ ట్యూమర్‌ బాధితుడి శస్త్రచికిత్సకు ఎల్‌ఓసీ మంజూరు చేయాలి

  • మంత్రి పొన్నం ప్రభాకర్‌కు విజ్ఞప్తి చేసిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పిడిశెట్టి రాజు

కోహెడ, నవంబర్‌ 21 (చైతన్యగళం): బ్రెయిన్‌ ట్యూమర్‌ వ్యాధితో బాధపడుతున్న నిరుపేద పూజారి మిశ్రా శస్త్రచికిత్సకు అవసరమైన ఆర్థిక సాయం అందించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు, కంటెస్టెడ్‌ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌కు విజ్ఞప్తి చేశారు. బాధితుడి శస్త్రచికిత్సకు రూ.10 లక్షలు అవసరమవుతాయని వైద్యులు తెలిపిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఎల్‌ఓసీ మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు.

కోహెడ మండల కేంద్రంలోని హనుమాన్‌ దేవాలయం, తీగలకుంటపల్లి గ్రామంలోని పార్వతీ పరమేశ్వర ఆలయంలో మిశ్రా నిత్య పూజారిగా పనిచేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఉపాధి కోసం వలస వచ్చి తీగలకుంటపల్లిలో స్థిరపడ్డారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పోషణకు ఆలయాల్లో పూజారి వృత్తిపై ఆధారపడిన మిశ్రా ప్రస్తుతం బ్రెయిన్‌ ట్యూమర్‌ వ్యాధితో బాధపడుతుండటంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

ఈ పరిస్థితుల్లో మిశ్రా శస్త్రచికిత్సకు అయ్యే ఖర్చును భరించే స్థోమత ఆయన కుటుంబానికి లేదని పిడిశెట్టి రాజు తెలిపారు. మానవతా దృక్పథంతో స్పందించి ఎల్‌ఓసీ ద్వారా ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు.

ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు వేముల శ్రీనివాస్‌ నేత, భూమయ్య, ఎస్‌. రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.