- పనులను పర్యవేక్షించిన తలకొండపల్లి సర్పంచ్ కటికెల శేఖర్ యాదవ్
తలకొండపల్లి, నవంబర్ 21 (చైతన్యగళం): గ్రామ అభివృద్ధిలో భాగంగా తలకొండపల్లి మండల కేంద్రంలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులకు ఇంటి యజమాని సహకరించడంతో పనులకు మార్గం సుగమమైంది. రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న ఇంటి భాగాన్ని తొలగించేలా సర్పంచ్ కటికెల శేఖర్ యాదవ్ చొరవ తీసుకున్నారు.
రోడ్డు విస్తరణకు ఆటంకంగా ఉన్న దోర్నాల శ్రీనివాస్ రెడ్డి ఇంటి యజమానితో సర్పంచ్ స్వయంగా మాట్లాడి, గ్రామ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని సహకరించాలని కోరారు. సర్పంచ్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ఇంటి యజమాని రోడ్డు విస్తరణకు సహకరించారు. దీంతో ఇంటి అడ్డుగా ఉన్న భాగాన్ని తొలగించి పనులు కొనసాగించేందుకు అవకాశం ఏర్పడింది.
ఈ సందర్భంగా సర్పంచ్ కటికెల శేఖర్ యాదవ్ పనుల ప్రదేశంలో ఉండి రోడ్డు విస్తరణ పనులను పర్యవేక్షించారు. గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంతోపాటు భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలను తగ్గించే లక్ష్యంతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని, అందరి భాగస్వామ్యంతో తలకొండపల్లిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.