CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 21 November 2026, 6:18 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఈ నెల 23న కరీంనగర్‌లో బీజేపీ మహా పాదయాత్ర

  • వాల్‌ పోస్టర్‌ ఆవిష్కరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌.. కార్యకర్తలు భారీగా తరలిరావాలి: గొల్లపల్లి వీరాచారి

హుస్నాబాద్‌, నవంబర్‌ 21 (చైతన్యగళం): ఎస్‌ఐఆర్‌పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం, ప్రజాస్వామ్య పరిరక్షణ లక్ష్యంగా ఈ నెల 23న కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న బీజేపీ మహా పాదయాత్రను విజయవంతం చేయాలని బీజేపీ కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గొల్లపల్లి వీరాచారి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి మహా పాదయాత్రకు సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు.

అనంతరం గొల్లపల్లి వీరాచారి మాట్లాడుతూ.. దేశ సమగ్రత, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఇండియా కూటమి, ఇతర ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఆయా పార్టీల దుష్ప్రచారాన్ని ప్రజల్లో ఎండగట్టేందుకు బీజేపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 40 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో మహా పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఇందులో భాగంగా ఈ నెల 23న కరీంనగర్‌లో సుమారు లక్ష మందితో భారీ మహా పాదయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ముఖ్య అతిథులుగా హాజరై పాదయాత్రకు నాయకత్వం వహించనున్నారని పేర్కొన్నారు. ఈ పాదయాత్రలో హుస్నాబాద్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.