CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 18 November 2026, 7:18 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఇర్విన్ ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ విధులకు వస్తున్నారా లేదా?

  • హాజరు రిజిస్టర్ చూపించాలని అడిగితే దురుసు సమాధానాలా? – బీజేపీ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు భూపేష్

మాడుగుల, నవంబర్ 18 (చైతన్యగళం): మాడుగుల మండలం ఇర్విన్ గ్రామంలోని ప్రభుత్వ వైద్యశాల పనితీరుపై బీజేపీ ఓబీసీ మోర్చా మాడుగుల మండల అధ్యక్షుడు భూపేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్యశాలలో డాక్టర్ ప్రతిరోజూ విధులకు హాజరవుతున్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు హాజరు రిజిస్టర్ చూపించాలని కోరితే, సంబంధిత నర్సు దురుసుగా సమాధానం ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది పనితీరుపై ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పకుండా దురుసుగా వ్యవహరించడం సరికాదని భూపేష్ అన్నారు. ఇర్విన్ గ్రామంలోని ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ ప్రతిరోజూ విధులకు హాజరవుతున్నారా? వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయా? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైద్యుడి హాజరు వివరాలు తెలుసుకునేందుకు రిజిస్టర్ చూపించడంలో అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు.

డాక్టర్ విధులకు వస్తున్నారా లేదా అనేది తెలుసుకోవడం ప్రజల హక్కు అని, విధులకు హాజరవుతున్నట్లయితే అందుకు సంబంధించిన ఆధారాలు చూపించాలని భూపేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్న వైద్య సిబ్బంది ప్రజలకు బాధ్యతాయుతంగా వైద్య సేవలు అందించాలని, ప్రజల ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వహించడం తగదని హెచ్చరించారు.

ఇర్విన్ ప్రభుత్వ వైద్యశాలలో వైద్యుల హాజరు, వైద్య సేవలపై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించినట్లు తేలితే బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని భూపేష్ డిమాండ్ చేశారు.