- ప్రతి పది పాయింట్లకు ఒక అవకాశం కల్పించాలి: మాల జేఏసీ చైర్మన్ ఆస లక్ష్మణ్
హుస్నాబాద్, నవంబర్ 17 (చైతన్యగళం):
ఎస్సీ వర్గీకరణలో భాగంగా అమలు చేస్తున్న రోస్టర్ విధానంలో మాల, మాల ఉపకులాలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని మాల జేఏసీ జిల్లా చైర్మన్ ఆస లక్ష్మణ్ కోరారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా మాల జేఏసీ నాయకులు రాష్ట్ర వర్గీకరణ ఉపసంఘం సభ్యుడు, మంత్రి పొన్నం ప్రభాకర్‌ను హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు.
అనంతరం హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నాయకులు మాట్లాడుతూ, ఎస్సీ కులాల వర్గీకరణలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా అనుభావిక గణాంకాలను పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. సరైన గణాంకాలు లేకుండా రోస్టర్ విధానాన్ని అమలు చేయడం వల్ల గ్రూప్–3లోని మాల, మాల ఉపకులాల విద్యార్థులు, ఉద్యోగులకు విద్యా, ఉద్యోగ అవకాశాల్లో అన్యాయం జరుగుతోందని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న రోస్టర్ విధానాన్ని సవరించి ప్రతి పది పాయింట్లకు ఒక అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వర్గీకరణ ఉపసంఘం సభ్యుడిగా ఈ అంశాన్ని పరిశీలించి మాలలకు న్యాయం జరిగేలా చూడాలని ఆస లక్ష్మణ్ కోరారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఆస బాబు, పార్థసారథి, బిక్షపతి, పల్లెటూరు ప్రసాద్, పాల శంకర్, రామకృష్ణ, పత్రి యాదగిరి, నర్సింగరావు, వెన్నరాజు, అరె కిషోర్, దండ్రు సుమన్, సుంకే రమేష్, జాల శ్రీనివాస్, ద్యాగల సతీష్, రాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.