- బహుజన బిడ్డగా ఆశీర్వదించి గెలిపించండి: ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్
మహబూబాబాద్:
పట్టభద్రుల సమస్యల పరిష్కారం, నిరుద్యోగ యువత ఆశయ సాధన, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచానని తెలంగాణ రక్షణ సేన అభ్యర్థి డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థిగా తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని, అనేక ఆటుపోట్లు ఎదుర్కొని పీహెచ్‌డీ సాధించానని, ప్రజా సమస్యలపై తనకు అవగాహన ఉందని తెలిపారు. పట్టభద్రులు తనను తమలో ఒకరిగా భావించి ఆశీర్వదించి, సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు.
మహబూబాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థి ఉద్యమకారులను గత పాలకులు విస్మరించారని విమర్శించారు. ఉద్యమ ఆశయాలను పక్కనపెట్టి రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. ఉద్యమంలో సర్వం కోల్పోయిన వారిని పక్కనపెట్టి అంగబలం, అర్థబలం ఉన్నవారికి రాజకీయ ప్రాధాన్యత కల్పించారని అన్నారు.
అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను నిరాశపరిచిందని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని నెరవేర్చలేదని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ నిరుద్యోగులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు.
తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తనపై నమ్మకంతో ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించారని తెలిపారు. అశోక్‌నగర్‌లో నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న కష్టాలు తనకు తెలుసని, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడతానని స్పష్టం చేశారు. గతంలో హామీలు ఇచ్చి గెలిచిన కొందరు ప్రజాప్రతినిధులు అధికార పార్టీలకు అనుకూలంగా మారారని విమర్శిస్తూ, తాను మాత్రం ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్సీ రవీందర్‌రావుపై శ్రీకాంత్ గౌడ్ విమర్శలు చేశారు. ఆయన వ్యవహారశైలిపై పలు ఆరోపణలు చేస్తూ, తనపై చేసిన విమర్శలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యాసంస్థలు, భూములకు సంబంధించిన వ్యవహారాలపైనా ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు.
అనంతరం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జ్ ఇస్మాయిల్ మాట్లాడుతూ సామాజిక న్యాయానికి ప్రాధాన్యతనిస్తూ బహుజన వర్గానికి చెందిన డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్‌కు తెలంగాణ రక్షణ సేన అవకాశం కల్పించిందన్నారు. బహుజన బిడ్డను గెలిపించడం ద్వారా ఉద్యమ ఆకాంక్షల సాధనకు పట్టభద్రులు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు గంధసిరి వేణు, మహబూబాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జ్ బోడ అనిల్ నాయక్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి గుండు ఉమేష్ కుమార్, సంగెం హర్షిత్, రాజేష్, విద్యార్థి నాయకులు, పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు.