CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 04 November 2026, 7:53 pm Posted by : rakeshkashaveni12@gmail.com

భూ సమస్యల శాశ్వత పరిష్కారమే భూభారతి లక్ష్యం

సిద్దిపేట, నవంబర్ 04 (చైతన్యగలం):

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని జిల్లా కలెక్టర్ కె. హైమావతి తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం జగదేవ్‌పూర్ మండలం గోపాల్‌పూర్ గ్రామంలో చేపట్టిన భూభారతి భూముల పునఃసర్వే ప్రక్రియను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సుమారు వందేళ్ల క్రితం భూముల సర్వే జరిగిందని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భూముల పునఃసర్వే చేపడుతోందని తెలిపారు. ముందుగా చిన్న గ్రామాలను ఎంపిక చేసి భూ సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

గోపాల్‌పూర్ గ్రామంలో సుమారు 399 ఎకరాల భూమి ఉందని, ముందుగా గ్రామ సరిహద్దులు, ప్రభుత్వ స్థలాలు, ఆబాది, చెరువులు, కుంటలు, నక్షా బాటల సర్వే పూర్తిచేసిన తర్వాతే పట్టా భూముల సర్వే చేపట్టాలని సర్వేయర్లను ఆదేశించారు.

పట్టా భూముల సర్వేకు రెండు రోజుల ముందుగానే రైతులకు సమాచారం అందించాలని సూచించారు. సర్వే సమయంలో భూ యజమానులు, రైతులు ప్రత్యక్షంగా పాల్గొని తమ సమస్యలు, సందేహాలను అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. సర్వే పూర్తయిన తర్వాత భూమికి సంబంధించిన వివరాలను తప్పనిసరిగా భూ యజమానులకు తెలియజేయాలని ఆదేశించారు.

ఒకే భూ యజమానికి ఒకే ప్రాంతంలో పలు సర్వే నంబర్లలో భూమి ఉన్నట్లయితే భూభారతి చట్టం ప్రకారం ఆ యజమానికి ఒకే సర్వే నంబర్ కేటాయించే విధానం ఉంటుందని తెలిపారు. రైతులు, భూ యజమానులు సర్వే ప్రక్రియకు అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భూమి కొనుగోలు చేసే ముందు తప్పనిసరిగా సర్వే చేయించుకున్న తర్వాతే కొనుగోలు చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సర్వే, రెవెన్యూ శాఖల అధికారులు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.