CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 04 November 2026, 5:35 pm Posted by : CHAITHANYA GALAM NEWS

విద్యార్థులకు పోలీస్‌ వ్యవస్థపై అవగాహన

  • పోలీసుల విధులు, చట్టాలు, సామాజిక బాధ్యతలపై వివరించిన ఎల్కతుర్తి ఎస్‌హెచ్‌ఓ

ఎల్కతుర్తి, నవంబర్‌ 4 (చైతన్యగళం):

విద్యార్థులకు పోలీస్‌ వ్యవస్థ పనితీరు, పోలీసుల విధులు, చట్టాలు, సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పించేందుకు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎల్కతుర్తి మండలం శాంతినగర్‌లోని సెయింట్‌ ఆన్స్‌ హైస్కూల్‌లో బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ నరసింహారావు విద్యార్థులకు పలు అంశాలను వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత కేసు స్వభావాన్ని బట్టి సంబంధిత చట్టాలు, సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఎస్‌ఐ విధులు, పోలీసు సిబ్బంది బాధ్యతలు, ఫిర్యాదుల స్వీకరణ, కేసుల విచారణ తదితర అంశాలను వివరించారు.

అనంతరం విద్యార్థులకు పోలీస్‌ స్టేషన్‌లోని వివిధ విభాగాలు, ఎస్‌ఐ కార్యాలయం, మహిళా విభాగాలను ప్రత్యక్షంగా చూపించి వాటి పనితీరును తెలియజేశారు. పోలీస్‌ వ్యవస్థ ప్రజలకు అందించే సేవలు, ఫిర్యాదుల పరిష్కారంలో అనుసరించే విధానాలను వివరించారు.

విద్యార్థులు గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, చిన్న వయసులోనే చెడు అలవాట్లకు బానిసలు కావద్దని ఎస్‌హెచ్‌ఓ సూచించారు. ఎక్కడైనా మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగం లేదా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.