CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 04 November 2026, 5:48 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్‌ది రాజకీయ దుష్ప్రచారమే!

  • ఓటరు జాబితా ప్రక్షాళనతో ప్రజాస్వామ్యం మరింత బలోపేతం: పోరెడ్డి కిషోర్‌రెడ్డి

హుస్నాబాద్‌, నవంబర్‌ 4 (చైతన్యగళం):

‘ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం.. అరాచక శక్తులను తరిమికొడదాం’ అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హుస్నాబాద్‌ పట్టణంలోని ఎస్‌ఆర్‌ఎల్‌ ఫంక్షన్‌ హాల్‌లో మంగళవారం రాత్రి మేధావుల సదస్సు నిర్వహించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియపై కాంగ్రెస్‌ పార్టీ, దాని మిత్రపక్షాలు ప్రజల్లో అపోహలు సృష్టిస్తూ అసత్య ప్రచారం చేస్తున్నాయని బీజేపీ నాయకులు విమర్శించారు. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టి, ఎస్‌ఐఆర్‌పై వాస్తవాలను ప్రజలకు వివరించాలనే లక్ష్యంతో పార్టీ జాతీయ నాయకత్వం పిలుపు మేరకు ఈ సదస్సు నిర్వహించినట్లు తెలిపారు.

బీజేపీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, కార్యక్రమ బాధ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు బైరి శంకర్‌ ముదిరాజ్‌ ముఖ్య అతిథిగా, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఐటీ, సోషల్‌ మీడియా విభాగం రాష్ట్ర బాధ్యుడు పోరెడ్డి కిషోర్‌రెడ్డి ముఖ్య వక్తగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన, వందేమాతరం గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమైంది.

ఈ సందర్భంగా బైరి శంకర్‌ ముదిరాజ్‌ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై వివిధ రాజకీయ భావజాలాలకు చెందిన కవులు, విద్యావంతులు, విశ్రాంత ఉద్యోగులు, న్యాయవాదులు, వైద్యులు, వాణిజ్య, వ్యాపార రంగాల ప్రతినిధులకు ఉన్న సందేహాలు, అభిప్రాయాలు తెలుసుకోవడమే ఈ సదస్సుల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. మేధావులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించాలని కోరారు.

అనంతరం పోరెడ్డి కిషోర్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌ అనేది బీజేపీ ప్రభుత్వం లేదా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్తగా ప్రవేశపెట్టిన విధానం కాదని, గతంలోనూ ఎన్నికల సంఘం వివిధ సందర్భాల్లో ఈ ప్రక్రియను నిర్వహించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండటంతో ఓటరు జాబితా సవరణను మరింత సమర్థంగా చేపట్టే అవకాశం ఉందన్నారు. మరణించిన ఓటర్లు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన పేర్లు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయిన వారి వివరాలు, అనర్హమైన నమోదులను గుర్తించి జాబితాను ప్రక్షాళన చేయడమే ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఈ ప్రక్రియలో బూత్‌ స్థాయి అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, రెవెన్యూ అధికారులు, ఎన్నికల సంఘం సమన్వయంతో పనిచేస్తారని తెలిపారు.

ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత పెంచేందుకు ఓటరు గుర్తింపు కార్డులు, ఫొటోతో కూడిన పోలింగ్‌ చీటీలు, ఈవీఎంలు, వీవీప్యాట్‌లు, పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వంటి సంస్కరణలు దోహదపడ్డాయని కిషోర్‌రెడ్డి పేర్కొన్నారు. గతంలో రిగ్గింగ్‌, బూత్‌ల ఆక్రమణ, దొంగ ఓట్లకు అవకాశం ఉన్న పరిస్థితులను అరికట్టడంలో ఈ చర్యలు కీలక పాత్ర పోషించాయని అన్నారు.

ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ఎన్నికల సంస్కరణలను స్వాగతించాల్సిన కాంగ్రెస్‌ పార్టీ, దాని మిత్రపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల సంఘంపై, రాజ్యాంగబద్ధ సంస్థలపై విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను తప్పుగా చిత్రీకరిస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ అని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంతోపాటు అనర్హమైన నమోదులను తొలగించడం ఎన్నికల వ్యవస్థ బాధ్యత అని తెలిపారు. అర్హులైన ఓటర్లు తమ వివరాలను పరిశీలించుకుని, ఎన్నికల సంఘం సూచనల మేరకు అవసరమైన పత్రాలు సమర్పించాలని సూచించారు.

కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న ప్రచారంలోని వాస్తవాలను ప్రజలు నిశితంగా పరిశీలించాలని, ఎన్నికల సంస్కరణలపై సరైన అవగాహన పెంపొందించుకోవాలని కిషోర్‌రెడ్డి పిలుపునిచ్చారు. అర్హులైన ఓటర్లకు అన్యాయం జరగకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వెంకటేశం, జిల్లా ఉపాధ్యక్షుడు మాచర్ల కుమారస్వామి, జిల్లా కార్యదర్శి పైడిపల్లి పృథ్వీరాజ్‌గౌడ్‌, హుస్నాబాద్‌ పట్టణ నాయకులు దొడ్డి శ్రీనివాస్‌, లక్కిరెడ్డి తిరుమలరెడ్డి, తోట స్వరూప, కొత్తపల్లి అశోక్‌, విలసాగరం మురళీమోహన్‌, ప్రభారీ నునావత్‌ మోహన్‌ నాయక్‌, న్యాయవాది వడ్లకొండ రవికుమార్‌రెడ్డి, హుస్నాబాద్‌, అక్కన్నపేట, కోహెడ, చిగురుమామిడి, సైదాపూర్‌, బిందెవరపల్లి, ఎల్కతుర్తి మండలాల బీజేపీ అధ్యక్షులు, పార్టీ వివిధ స్థాయిల నాయకులు, కార్యకర్తలు, న్యాయవాదులు, విశ్రాంత ఉద్యోగులు, వివిధ రంగాలకు చెందిన మేధావులు పాల్గొన్నారు.