CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 11:28 am Posted by : CHAITHANYA GALAM NEWS

పోలీస్‌ ఉద్యోగాలే లక్ష్యంగా పట్టుదలతో ముందుకు సాగాలి

  • అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేసిన కలెక్టర్‌ స్నేహ శబరీష్‌, ఎస్పీ డా. శబరీష్‌
  • కష్టపడి చదివితేనే విజయం సొంతం: జిల్లా ఎస్పీ
  • ప్రజాసేవలో భాగస్వాములు కావడం గర్వకారణం: కలెక్టర్‌

మహబూబాబాద్‌, నవంబర్‌ 2(చైతన్యగళం):

పోలీస్‌ ఉద్యోగాలే లక్ష్యంగా సిద్ధమవుతున్న యువత పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర కృషితో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్‌ స్నేహ శబరీష్‌, ఎస్పీ డా. శబరీష్‌ సూచించారు. జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్‌లో పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో కానిస్టేబుల్‌, సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగ అభ్యర్థులకు అందిస్తున్న ఉచిత శిక్షణ శిబిరాన్ని సోమవారం వారు సందర్శించారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేసి, పరీక్షల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ డా. శబరీష్‌ మాట్లాడుతూ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే కష్టపడి పనిచేయడమే మార్గమని అన్నారు. అభ్యర్థులు ప్రతిరోజూ నిర్దిష్ట ప్రణాళికతో చదువుతూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాత పరీక్షలతోపాటు శారీరక సామర్థ్య పరీక్షలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని, నిరంతరం సాధన చేయాలని చెప్పారు. పోటీ పరీక్షల సమయంలో ఎదురయ్యే ఒత్తిడి, అపజయాలు, ఆటంకాలకు కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. పునశ్చరణ, నమూనా పరీక్షలు, సమయపాలనతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. పోలీస్‌ శాఖ అందిస్తున్న ఉచిత శిక్షణ, స్టడీ మెటీరియల్‌ను సద్వినియోగం చేసుకొని ఉద్యోగ లక్ష్యాన్ని చేరుకోవాలని పిలుపునిచ్చారు.

కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ మాట్లాడుతూ అభ్యర్థులు లక్ష్యంపై ఏకాగ్రతతో ప్రణాళికాబద్ధంగా చదువును కొనసాగించాలని సూచించారు. అందుబాటులో ఉన్న సమయాన్ని పరీక్షల సన్నద్ధతకు పూర్తిగా వినియోగించుకోవాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల రక్షణ, సమాజ సేవలో పోలీస్‌ శాఖ పాత్ర కీలకమని పేర్కొన్నారు. అటువంటి బాధ్యతాయుతమైన శాఖలో చేరి ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం గర్వకారణమని అన్నారు. ఉద్యోగాలు సాధించిన అనంతరం బాధ్యత, అంకితభావం, సేవా దృక్పథంతో విధులు నిర్వహించాలని ఆకాంక్షించారు.

యువతకు సరైన మార్గదర్శకత్వం, శిక్షణ, స్టడీ మెటీరియల్‌ అందించడం ద్వారా వారి లక్ష్యసాధనకు జిల్లా పోలీస్‌ శాఖ తోడ్పాటునందిస్తోందని అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అభ్యర్థులందరూ ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్‌, ఎస్పీ ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు, ఆర్‌ఐ భాస్కర్‌, శిక్షకులు భాగ్యకిరణ్‌, పోలీస్‌ కానిస్టేబుల్‌, ఎస్‌ఐ ఉద్యోగ అభ్యర్థులు పాల్గొన్నారు.