- హుస్నాబాద్ ప్రాంతంలో గుట్టలు మాయమవుతున్నాయి
- బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు అయిలేని మల్లికార్జునరెడ్డి
హుస్నాబాద్, నవంబర్ 3 (చైతన్యగళం):
ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇష్టారాజ్యంగా మట్టిని తరలిస్తూ కొందరు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు అయిలేని మల్లికార్జునరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో హుస్నాబాద్ ప్రాంతంలో గుట్టలకు గుట్టలు మాయమవుతున్నాయని, అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.
మట్టిని తరలించేందుకు ప్రభుత్వ అనుమతులు తీసుకున్నారా లేదా అనే విషయాన్ని కూడా అధికారులు విచారించడం లేదన్నారు. కాంట్రాక్టు పనులకు మట్టి అవసరమైతే సంబంధిత కాంట్రాక్టర్లు మట్టిని కొనుగోలు చేసుకోవాలని, కానీ ప్రభుత్వ గుట్టలను తవ్వి మట్టిని తరలిస్తున్నారని ఆరోపించారు. మట్టి తరలింపుపై ప్రశ్నిస్తే అభివృద్ధి పనుల పేరుతో ముసుగు వేస్తున్నారని ఎద్దేవా చేశారు.
హుస్నాబాద్ ప్రాంతం నుంచి కోట్ల రూపాయల విలువైన మట్టి తరలిపోయిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మట్టి తరలింపుపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని, ప్రభుత్వ గుట్టలను కాపాడాలని అయిలేని మల్లికార్జునరెడ్డి కోరారు.