CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 9:40 pm Posted by : CHAITHANYA GALAM NEWS

విద్యారంగ సమస్యలను పరిష్కరించి.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి

  • పిపిఎల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఈదుల రామాంజనేయులు డిమాండ్‌

మహబూబాబాద్‌, అక్టోబర్‌ 31 (చైతన్యగళం): విద్యారంగంలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించి, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం (పిపిఎల్‌) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఈదుల రామాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

శనివారం మహబూబాబాద్‌ జిల్లా హనుమంతునిగడ్డలోని అంబేద్కర్‌ కమ్యూనిటీ హాల్‌లో పిపిఎల్‌ జిల్లా విస్తృతస్థాయి సమావేశం జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర వనరుల ప్రతినిధి ఐనాల పరశురాములు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు ఈదుల రామాంజనేయులు, రాష్ట్ర కన్వీనర్‌ చాతల్ల సదానందం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాల నుంచి విశ్వవిద్యాలయాల వరకు విద్యాసంస్థల్లో కనీస మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంలో లోపాలు ఉన్నాయని, సరిపడా బోధనా సిబ్బంది లేక విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, ఇతర విద్యాసంస్థలకు పక్కా భవనాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. కొన్ని విద్యాసంస్థలు జీవో నంబర్‌ 5ను పట్టించుకోకుండా ఫీజులు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయని ఆరోపించారు. గురుకులాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు.

ఈ పరిస్థితుల కారణంగా పేద, మధ్యతరగతి విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యారంగ సమస్యలను పరిష్కరించడంతో పాటు విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

అనంతరం నిర్వహించిన పిపిఎల్‌ జిల్లా కమిటీ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఏడేల్లి వెంకటేశ్‌ (మరిపెడ), అధికార ప్రతినిధిగా ఐనాల వెంకన్న (మరిపెడ), ఉపాధ్యక్షుడిగా ఈరెల్లి మల్లేష్‌ (గూడూరు), ప్రధాన కార్యదర్శిగా మునిగంటి కోమలి (నెల్లికుదురు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కో-ఆప్షన్‌ సభ్యులుగా మరికొందరిని ఎంపిక చేశారు.

ఈ కార్యక్రమంలో పిపిఎల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోట్ల మౌనిక, ఉమ్మడి వరంగల్‌ జిల్లా సలహాదారు శనిగరపు శ్రీనివాస్‌, నాయకులు ఏడేల్లి వెంకటేశ్‌, ఐనాల వెంకన్న, ఈరెల్లి మల్లేష్‌, తప్పెట్ల చాణక్య, ఇమ్మడి వెంకటేశ్వర్లు, మట్టే మధు, కోమలి, యాసారపు రేణుక తదితరులు పాల్గొన్నారు.