CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 9:23 pm Posted by : CHAITHANYA GALAM NEWS

హుస్నాబాద్‌ నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి

  • రైతుల పరిస్థితిని ప్రభుత్వం గుర్తించాలి: బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ అధ్యక్షుడు పెరుక భాగ్యరెడ్డి

హుస్నాబాద్‌, అక్టోబర్‌ 31 (చైతన్యగళం): హుస్నాబాద్‌ నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. మెట్ట ప్రాంతంగా ఉన్న హుస్నాబాద్‌ నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించేలా చర్యలు తీసుకోవడంలో స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్‌ విఫలమయ్యారని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపించారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ హుస్నాబాద్‌ నియోజకవర్గ అధ్యక్షుడు పెరుక భాగ్యరెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం నుంచి గోదావరి జలాలను ఎత్తిపోసి సాగునీరు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఎల్‌నినో ప్రభావంతో నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. రైతుల కష్టాలు స్థానిక మంత్రికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

నియోజకవర్గంలోని కరువు పరిస్థితులను ప్రభుత్వం తక్షణమే పరిశీలించి, హుస్నాబాద్‌ను కరువు ప్రాంతంగా ప్రకటించాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.