CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 1:35 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దాడి

  • అడ్డుకునేందుకు వెళ్లిన మరో విద్యార్థినికి గాయాలు.. నిందితుడి కోసం పోలీసుల గాలింపు

రాప్తాడు, అక్టోబర్‌ 31 (చైతన్యగళం):

అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై పాఠశాలలోకి ప్రవేశించిన గుర్తుతెలియని వ్యక్తి చెట్ల కొమ్మలు కోసే రంపంతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాలిక ముఖం, తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని కూడా గాయపడింది.

పాఠశాల ప్రారంభమైన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. తరగతి గదిలో ఉన్న విద్యార్థినిపై గుర్తుతెలియని వ్యక్తి ఒక్కసారిగా రంపంతో దాడి చేయడంతో పాఠశాలలో భయాందోళనలు నెలకొన్నాయి. దాడిని చూసిన విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. అప్రమత్తమైన ఉపాధ్యాయులు, ఇతర విద్యార్థులు గాయపడిన బాలికలను ఆదుకునేందుకు ప్రయత్నించి పోలీసులకు సమాచారం అందించారు.

తీవ్రంగా గాయపడిన ప్రధాన బాధితురాలిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో విద్యార్థినికి కూడా గాయాలైనట్లు తెలిసింది. అయితే బాధితుల ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

దాడికి పాల్పడిన వ్యక్తి ఎవరనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దాడికి గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పాఠశాల పరిసరాల్లో వివరాలు సేకరిస్తూ నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. పాఠశాలలోకి గుర్తుతెలియని వ్యక్తి ఎలా ప్రవేశించాడనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.