CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 30 October 2026, 10:30 pm Posted by : CHAITHANYA GALAM NEWS

విద్యార్థుల భద్రతపై పోలీసుల ప్రత్యేక అవగాహన

  • మహిళా భద్రత, సైబర్‌ నేరాలు, బాలల హక్కులపై అవగాహన

మహబూబాబాద్‌, అక్టోబర్‌ 30 (చైతన్యగళం):

విద్యార్థుల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని, అప్రమత్తతతోనే నేరాల నుంచి రక్షణ పొందవచ్చని సీనియర్‌ సివిల్‌ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి స్వాతి మురారి పేర్కొన్నారు. మహబూబాబాద్‌ జిల్లా ఎస్పీ డాక్టర్‌ పి. శబరీష్‌ ఆదేశాల మేరకు శుక్రవారం పట్టణంలోని ఫాతిమా హైస్కూల్‌లో షీ టీం, యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌ (ఏహెచ్‌టీయూ), జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా స్వాతి మురారి, షీ టీం ఎస్‌ఐ సునంద, సీనియర్‌ న్యాయవాది వై. చెన్నమల్లెల రెడ్డి మాట్లాడుతూ మహిళలు, బాలికల భద్రత కోసం షీ టీం అందిస్తున్న సేవలను వివరించారు. వేధింపులు ఎదురైనప్పుడు ఫిర్యాదు చేసే విధానం, ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచే విధానం, బాధితులకు పోలీసుల నుంచి లభించే సహకారం గురించి తెలియజేశారు.

సోషల్‌ మీడియా వినియోగంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని లింకులను తెరవవద్దని, ఓటీపీ వివరాలను ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించారు. సైబర్‌ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌పై అవగాహన కలిగి ఉండాలని వివరించారు.

మానవ అక్రమ రవాణా నివారణ, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత, పోక్సో చట్టం, బాలల హక్కులు, మహిళలు, చిన్నారులకు అందించే రక్షణ సేవలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనుమానాస్పద పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

అత్యవసర పరిస్థితుల్లో షీ టీం నంబర్‌ 8712656935, పోలీస్‌ అత్యవసర నంబర్‌ 112, సైబర్‌ నేరాల హెల్ప్‌లైన్‌ 1930, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098ను సంప్రదించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్‌ బెలీనా, ఉపాధ్యాయ బృందం, సుమారు 300 మంది విద్యార్థినీ విద్యార్థులు, షీ టీం సిబ్బంది రమేష్‌, పార్వతి, సుధారాణి, ప్రియాంక, ఏహెచ్‌టీయూ సిబ్బంది ఏఎస్ఐ రాజు, అరుణ, సుప్రజ తదితరులు పాల్గొన్నారు.