- అసంపూర్తి పనులు, రోడ్డు గుంతలపై ప్రయాణికుల ఆందోళన
హుస్నాబాద్ రూరల్, అక్టోబర్ 29 (చైతన్యగళం):
హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామ శివారులో నిర్మాణంలో ఉన్న టోల్‌గేట్ సమీపంలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై గుంతలు ఉండటంతో అటుగా వెళ్తున్న స్విఫ్ట్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న దంపతులకు స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పగా, కారు తీవ్రంగా దెబ్బతింది.
టోల్‌గేట్ నిర్మాణ పనులు ఇంకా పూర్తికాకపోవడం, రోడ్డుపై గుంతలు ఏర్పడటం, వాహనదారులను అప్రమత్తం చేసే హెచ్చరిక బోర్డులు సక్రమంగా ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో ప్రయాణం ప్రమాదకరంగా మారుతోందని పేర్కొంటున్నారు.
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్డుపై గుంతలకు మరమ్మతులు చేపట్టాలని, నిర్మాణ ప్రాంతంలో తగిన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతోపాటు భద్రతా చర్యలు పటిష్టం చేయాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.