CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 29 October 2026, 5:58 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా ప్రమాణాలు

  • విద్యార్థులకు షూ, బెల్టులు, ఆట వస్తువుల పంపిణీ.. సర్పంచ్ వెన్న స్వర్ణలత

హుస్నాబాద్ రూరల్, అక్టోబర్ 29 (చైతన్యగళం):

హుస్నాబాద్ మండలం మాలపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న షూ, బెల్టులను గ్రామ సర్పంచ్ వెన్న స్వర్ణలత పంపిణీ చేశారు. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు పాఠశాలకు ఆట వస్తువులను సైతం అందజేశారు.

ఈ సందర్భంగా వెన్న స్వర్ణలత మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెరుగుతున్నాయని, విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న అల్పాహార కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందడంతోపాటు పాఠశాలలకు హాజరయ్యే వారి సంఖ్య పెరుగుతుండటం సంతోషకరమన్నారు. చదువుతోపాటు క్రీడలు కూడా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. ఆట వస్తువులను సద్వినియోగం చేసుకుంటూ క్రీడల్లో ప్రతిభ కనబరచాలని విద్యార్థులకు సూచించారు.

తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకంతో తమ పిల్లలను చేర్పించాలని, ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాలని కోరారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి గ్రామపంచాయతీ తరఫున సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బత్తుల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెన్న రాజు, పాలకవర్గ సభ్యులు సొల్లు రజినీకాంత్, గుండాల ప్రశాంత్, బత్తుల వీరస్వామి, వెన్న శారద, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సతీష్, ఉపాధ్యాయురాలు సరస్వతీ దేవి, ఇన్‌స్పెక్టర్ టీచర్ వెన్న ఝాన్సీ, అంగన్‌వాడీ టీచర్ సరోజన, ఆయాలు అనూష, అశ్విని, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.