CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 28 October 2026, 10:22 pm Posted by : CHAITHANYA GALAM NEWS

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు నవంబర్‌ 6 చివరి గడువు

  • అర్హులైన పట్టభద్లులందరూ నమోదు చేసుకోవాలి: అదనపు కలెక్టర్‌ లక్ష్మీకిరణ్‌

సిద్దిపేట, అక్టోబర్‌ 28 (చైతన్యగళం):

వరంగల్‌–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు పొందేందుకు అర్హులైన పట్టభద్రులందరూ గడువులోగా ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) లక్ష్మీకిరణ్‌ కోరారు. ఓటరు నమోదు ప్రక్రియకు నవంబర్‌ 6 చివరి తేదీ అని స్పష్టం చేశారు.

బుధవారం సిద్దిపేట కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని చేర్యాల, ధూల్మిట్ట, మద్దూరు, కొమురవెల్లి మండలాలు వరంగల్‌–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలోకి వస్తాయని తెలిపారు. ఈ నాలుగు మండలాల నుంచి ఇప్పటివరకు ఫారం–18 ద్వారా 4,749 దరఖాస్తులు అందాయని, వాటి పరిశీలన కొనసాగుతోందని వెల్లడించారు.

పట్టభద్రుల ఓటర్ల జాబితా ముసాయిదాను నవంబర్‌ 25, 2026న ప్రచురించనున్నట్లు అదనపు కలెక్టర్‌ తెలిపారు. నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 10 వరకు జాబితాపై అభ్యంతరాలు, క్లెయిమ్‌లు సమర్పించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. డిసెంబర్‌ 25న క్లెయిమ్‌ల పరిష్కారం చేపట్టి, డిసెంబర్‌ 30న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నట్లు వివరించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల పరిధిలోని నాలుగు మండలాల్లో అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకునేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు చొరవ తీసుకోవాలని లక్ష్మీకిరణ్‌ సూచించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించే దిశగా అవగాహన పెంచాలని కోరారు.

ఈ సమావేశంలో కలెక్టరేట్‌ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌, కాంగ్రెస్‌ ప్రతినిధి ఆంజనేయులు, బీఆర్‌ఎస్‌ ప్రతినిధి మోహన్‌లాల్‌, ఎంఐఎం ప్రతినిధి మునీర్‌, ఐటీ సపోర్టర్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.