- కరువు మండలాల జాబితాను సవరించాలి.. పంట నష్టంపై క్షేత్రస్థాయి సర్వే చేపట్టాలి: సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్
కరీంనగర్, అక్టోబర్ 28 (చైతన్యగళం):
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రైతాంగం కరువు పరిస్థితులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా అశాస్త్రీయంగా కరువు మండలాలను ప్రకటించడం అన్యాయమని ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితా అశాస్త్రీయంగా ఉందని, జిల్లాలో కేవలం కరీంనగర్ రూరల్, కరీంనగర్ అర్బన్, హుజూరాబాద్ మండలాలను మాత్రమే కరువు మండలాలుగా గుర్తించడం సరికాదని అన్నారు. ఏ ప్రాతిపదికన ఈ మండలాలను ఎంపిక చేశారో అధికారులు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ సాగు భూములు పరిమితంగా ఉన్న కరీంనగర్ అర్బన్ పరిధిని కరువు ప్రాంతంగా ప్రకటించి, వర్షాభావంతో పంటలు ఎండిపోతున్న గ్రామీణ మండలాలను విస్మరించడం రైతులకు అన్యాయం చేయడమేనని విమర్శించారు.
మానకొండూరు, తిమ్మాపూర్, గంగాధర, రామడుగు, చొప్పదండి, చిగురుమామిడి, సైదాపూర్, శంకరపట్నం, ఇల్లందకుంట తదితర మండలాల్లో వరి, పత్తి పంటలకు సాగునీరు అందక, విద్యుత్ సరఫరా సకాలంలో లేక పంటలు ఎండిపోతున్నాయని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు పంటలు చేతికందే దశలో నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాలను గుర్తించాలని కోరారు.
అధికారుల నివేదికల్లో లోపాల కారణంగా జిల్లాలోని అనేక మంది రైతులు పెట్టుబడి రాయితీ, పంట రుణాల మాఫీ లేదా రీషెడ్యూల్, పంటల బీమా వంటి ప్రయోజనాలను కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కరువు మండలాల ఎంపికలో పారదర్శకత పాటించాలని, క్షేత్రస్థాయికి వెళ్లకుండా ఉపగ్రహ చిత్రాలు, తేమ గణాంకాల ఆధారంగా నివేదికలు రూపొందించారన్న విమర్శలపై అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
జిల్లా వ్యాప్తంగా పునఃసర్వే నిర్వహించి, ప్రత్యేక అధికారుల బృందాలతో పంట నష్టాన్ని పారదర్శకంగా అంచనా వేయాలని శ్రీనివాస్ కోరారు. పంటలు ఎండిపోయిన ప్రతి మండలాన్ని కరువు జాబితాలో చేర్చుతూ అదనపు ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావానికి గురైన ప్రతి ఎకరాకు రూ.25 వేల చొప్పున తక్షణ పెట్టుబడి రాయితీ అందించాలని, కరువు పీడిత రైతుల పంట రుణాలను రీషెడ్యూల్ చేయాలని కోరారు. బ్యాంకులు, ప్రైవేటు ఆర్థిక సంస్థలు రైతుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి కరీంనగర్ జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.