CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 28 October 2026, 9:58 pm Posted by : CHAITHANYA GALAM NEWS

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి

  • ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి: ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం భోగేశ్వర్‌

కరీంనగర్‌, అక్టోబర్‌ 28 (చైతన్యగళం):

ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని, విద్యారంగంలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) కరీంనగర్‌ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గాంధీ చౌక్‌ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం భోగేశ్వర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామని, రాష్ట్రంలో కార్పొరేట్‌ విద్యావ్యవస్థను లేకుండా చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చి, దాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

విద్య కేంద్రీకరణ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 24 వేల పాఠశాలలను మూసివేసే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలని, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా విద్యారంగ సమస్యలపై స్పందించి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని భోగేశ్వర్‌ డిమాండ్‌ చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ నిరసన కార్యక్రమంలో ఉదయ్‌, మణి, కల్యాణ్‌, రవితేజ, వరుణ్‌ కుమార్‌, మారుతి, నిఖిల్‌ తదితరులు పాల్గొన్నారు.