CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 28 October 2026, 10:14 pm Posted by : CHAITHANYA GALAM NEWS

భూ సర్వేలో తప్పులకు తావివ్వొద్దు

  • పారదర్శకంగా, ఖచ్చితత్వంతో రీ సర్వే నిర్వహించాలి: కలెక్టర్‌ హైమావతి

సిద్దిపేట, అక్టోబర్‌ 28 (చైతన్యగళం):

భూ భారతి రీ సర్వేను పారదర్శకంగా, ఖచ్చితత్వంతో నిర్వహిస్తూ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం కొమురవెల్లి మండలం తపాస్‌పల్లి గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా గ్రామ విస్తీర్ణం, ఇప్పటివరకు పూర్తయిన సర్వే పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెరుగుతున్న జనాభా, భూ వివాదాల నేపథ్యంలో భూములకు సంబంధించిన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ప్రభుత్వం భూ భారతి రీ సర్వే చేపడుతోందని కలెక్టర్‌ తెలిపారు. సర్వే పనుల్లో వేగం పెంచి, రోజుకు 40 ఎకరాలకు పైగా సర్వే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

భూముల విస్తీర్ణం, సర్వే నంబర్లు, హద్దులు, పట్టా వివరాలను సంబంధిత రికార్డులతో క్షుణ్ణంగా సరిపోల్చి నమోదు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. సర్వేకు సంబంధించిన ప్రతి అంశాన్ని రెవెన్యూ రికార్డుల్లో పొందుపరచాలని, సర్వే పూర్తయిన భూముల వివరాలను సంబంధిత యజమానులకు తెలియజేయాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా సర్వే ప్రక్రియను జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు.

భూ భారతి రీ సర్వేకు రైతులు సహకరించాలని కలెక్టర్‌ కోరారు. ఈ ప్రక్రియ ద్వారా భూముల హద్దులు, సర్వే నంబర్లు, బై నంబర్లకు సంబంధించిన సమస్యలను నివారించడంతోపాటు భూముల వివరాలపై స్పష్టత పొందవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌, స్థానిక సర్పంచ్‌, ప్రజాప్రతినిధులు, సర్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.