CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 28 October 2026, 9:57 pm Posted by : CHAITHANYA GALAM NEWS

బాలల భద్రతే సమాజ బాధ్యత

  • పోక్సో చట్టంతో చిన్నారులకు పటిష్ట రక్షణ: సీనియర్‌ సివిల్‌ జడ్జి యశ్వంత్‌ సింగ్‌

కరీంనగర్‌ టౌన్‌, అక్టోబర్‌ 28 (చైతన్యగళం):

బాలల హక్కుల పరిరక్షణకు, వారిపై జరిగే నేరాల నివారణకు చట్టాలు పటిష్టమైన రక్షణ కల్పిస్తున్నాయని, ప్రతి చిన్నారికి సురక్షితమైన బాల్యాన్ని అందించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి యశ్వంత్‌ సింగ్‌ అన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మార్గదర్శకత్వంలో చేపట్టిన ‘సురక్షిత్‌ బచ్పన్‌ అభియాన్‌’లో భాగంగా బుధవారం కరీంనగర్‌లోని మంకమ్మతోట ధన్గర్‌వాడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మూడో రోజు న్యాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యశ్వంత్‌ సింగ్‌ విద్యార్థులకు బాలల హక్కులు, వ్యక్తిగత భద్రత, నేరాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏళ్లలోపు బాలబాలికలను లైంగిక వేధింపులు, లైంగిక దాడులు, ఇతర లైంగిక నేరాల నుంచి రక్షించేందుకు లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం–2012 (పోక్సో) రూపొందించబడిందని వివరించారు. ఈ చట్టం కింద నేరాలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడంతోపాటు, కేసుల విచారణ కోసం ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు వంటి నిబంధనలు ఉన్నాయని తెలిపారు. బాధిత చిన్నారుల గుర్తింపు, వ్యక్తిగత వివరాలు బహిర్గతం కాకుండా వారి గౌరవం, గోప్యతను కాపాడటం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.

బాలలపై నేరం జరిగినట్లు తెలిసినా, అనుమానం కలిగినా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని, ఇటువంటి ఘటనలను నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. పిల్లలు తమకు ఎదురయ్యే ఇబ్బందులు, వేధింపుల గురించి భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా విశ్వసనీయమైన పెద్దలకు చెప్పగలిగే వాతావరణాన్ని కల్పించాలని అన్నారు. ఎవరైనా తమను అసౌకర్యానికి గురిచేసినా, అనుచితంగా ప్రవర్తించినా మౌనంగా ఉండకుండా సహాయం కోరాలని విద్యార్థులకు సూచించారు. పిల్లలు తమ సమస్యలను వెల్లడించినప్పుడు వారిని నిందించకుండా, వారి మాటలను శ్రద్ధగా విని అవసరమైన సహాయం అందించాలని పెద్దలకు విజ్ఞప్తి చేశారు.

బాలల భద్రత పోలీసు, న్యాయవ్యవస్థ, విద్యాసంస్థలకే పరిమితం కాదని, కుటుంబాలు, ఉపాధ్యాయులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని యశ్వంత్‌ సింగ్‌ పిలుపునిచ్చారు. చట్టాలపై అవగాహనతోపాటు సామాజిక చైతన్యం పెంపొందించినప్పుడే చిన్నారులకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించగలమని పేర్కొన్నారు. ప్రతి చిన్నారి హక్కులను గౌరవిస్తూ వారి రక్షణకు సమష్టిగా కృషి చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు, న్యాయవాది ఏ. కిరణ్‌ కుమార్‌, టూ టౌన్‌ ఎస్‌ఐ నరేష్‌ రెడ్డి, అసిస్టెంట్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌లు ఎలుగు తన్మయి, మర్రి భావన, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గొట్టే ప్రమోద, చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారి శ్రీలత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.