CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 28 October 2026, 8:25 pm Posted by : CHAITHANYA GALAM NEWS

మంత్రి సొంత నియోజకవర్గంలోనే అద్దె భవనంలో బీసీ బాలికల వసతి గృహం!

  • ప్రభుత్వానికి విద్యార్థినుల సమస్యలు పట్టవా?
  • సొంత భవనం మంజూరు చేయాలి: ఏబీవీపీ నేత సావుల ఆదిత్య

హుస్నాబాద్‌, అక్టోబర్‌ 28 (చైతన్యగళం):

బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ సొంత నియోజకవర్గ కేంద్రమైన హుస్నాబాద్‌లోనే ప్రభుత్వ బీసీ బాలికల పోస్టుమెట్రిక్‌ వసతి గృహం అద్దె భవనంలో కొనసాగడం బాధాకరమని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సావుల ఆదిత్య విమర్శించారు. విద్యార్థినులకు మెరుగైన వసతులు కల్పించాల్సిన ప్రభుత్వం, సొంత భవనాన్ని ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు.

మంత్రి పొన్నం ప్రభాకర్‌ హుస్నాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రి పదవి చేపట్టి సుమారు మూడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహానికి సొంత భవనం లేకపోవడం ఆందోళనకరమని ఆదిత్య పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థినులు చదువుల కోసం వసతి గృహాలపై ఆధారపడుతున్న నేపథ్యంలో వారికి అవసరమైన సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

అద్దాల వంతెన, డివైడర్లపై విగ్రహాలు, జిల్లెలగడ్డ పార్కు వంటి అభివృద్ధి పనులను చూపిస్తూ హుస్నాబాద్‌ అభివృద్ధి చెందిందని చెప్పడం సరికాదని ఆయన విమర్శించారు. విద్యార్థినులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం కూడా అభివృద్ధిలో భాగమేనని స్పష్టం చేశారు.

ఇప్పటికైనా మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పందించి ప్రభుత్వ బీసీ బాలికల పోస్టుమెట్రిక్‌ వసతి గృహానికి సొంత భవనం మంజూరు చేయించాలని సావుల ఆదిత్య విజ్ఞప్తి చేశారు. పేద విద్యార్థినులకు న్యాయం చేస్తూ, హుస్నాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.