- పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు.. ప్రజావాణిలో కలెక్టర్‌కు శ్రీనివాస్‌నగర్ గ్రామస్తుల వినతి
మానకొండూర్, అక్టోబర్ 26 (చైతన్యగళం): జాతీయ రహదారి 563పై అండర్‌పాస్ నిర్మించి, రాకపోకలకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలని మానకొండూర్ మండలం శ్రీనివాస్‌నగర్ గ్రామ రైతులు, గ్రామస్తులు కోరారు. ఈ మేరకు సోమవారం గ్రామ సర్పంచ్ ఎరుకల శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
గ్రామానికి చెందిన రైతుల వ్యవసాయ భూములు జాతీయ రహదారికి అవతలివైపు ఉండటంతో పొలాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. పశువులను తీసుకెళ్లాలన్నా సమస్యలు తప్పడం లేదన్నారు. సమీపంలో సరైన మార్గం లేకపోవడంతో సుమారు రెండు కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోందని పేర్కొన్నారు. వ్యవసాయ పనుల కోసం కొన్నిసార్లు రహదారిపై వ్యతిరేక దిశలో ప్రయాణించాల్సి వస్తోందని, దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
అలాగే, జాతీయ రహదారి పక్కన మురుగునీటి కాలువల వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షాలు కురిసినప్పుడు వరద నీరు ఇళ్లలోకి చేరుతోందని గ్రామస్తులు తెలిపారు. ఈ సమస్యలపై గతంలో పలుమార్లు అధికారులకు విన్నవించినప్పటికీ పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు. రైతులు, గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఎన్‌హెచ్-563పై అండర్‌పాస్ నిర్మించడంతోపాటు, మురుగునీటి కాలువల సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌ను కోరారు.