CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 27 October 2026, 5:22 pm Posted by : CHAITHANYA GALAM NEWS

యువత మత్తుకు దూరంగా ఉండి మైదానాల వైపు రావాలి

  • ‘ఖేలో తెలంగాణ’లో యువత, విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలి: ఎంపీ ఎం. అనిల్‌ కుమార్‌ యాదవ్‌

హైదరాబాద్‌, అక్టోబర్‌ 27 (చైతన్యగళం): యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రీడలు, వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని రాజ్యసభ సభ్యుడు ఎం. అనిల్‌ కుమార్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ క్రీడా శాఖ చేపట్టిన ‘ఖేలో తెలంగాణ’ కార్యక్రమంలో యువత, విద్యార్థులు నిరంతరం పాల్గొనాలని సూచించారు.

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా క్రీడలు, శారీరక దారుఢ్యంపై అవగాహన కల్పిస్తున్న తెలంగాణ క్రీడా శాఖను అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అభినందించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతోపాటు ఆరోగ్యకరమైన జీవనశైలికి దోహదపడతాయని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ‘ఖేలో తెలంగాణ’ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క, మంత్రి శ్రీధర్‌బాబుతో పాటు ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని విద్యార్థులు, యువతకు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఫిట్‌నెస్‌ సవాల్‌ విసిరారు. యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుని నిత్యం వ్యాయామం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జీఎంసీబీ స్టేడియం నిర్వాహకుడు కన్నం మధు, క్రీడా ప్రాధికార సంస్థ ప్రజాసంబంధాల అధికారి సురేష్‌, కాలేరు తదితరులు పాల్గొన్నారు.