- నిర్మాణ పనుల్లో జాప్యం వద్దు.. నాణ్యతా ప్రమాణాలు పాటించాలి: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
నాగర్‌కర్నూల్, అక్టోబర్ 27 (చైతన్యగళం): నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాల ఆవరణలో నిర్మాణంలో ఉన్న 550 పడకల ఆసుపత్రి పనులను డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆసుపత్రి నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన, ఇప్పటివరకు పూర్తయిన పనులు, ఇంకా చేపట్టాల్సిన నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు.
నిర్మాణం ఏ మేరకు పూర్తయింది, పెండింగ్‌లో ఉన్న పనులేమిటి, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో చర్చించారు. మిగిలిన పనులను గుర్తించి, ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
ఆసుపత్రి నిర్మాణం ప్రభుత్వం నిర్దేశించిన నమూనా, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా జరగాలని కలెక్టర్ పేర్కొన్నారు. నిర్మాణంలో వినియోగించే సామగ్రి నాణ్యతతో పాటు పనుల ప్రమాణాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు. గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు, భవిష్యత్తులో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా ఆసుపత్రిని నాణ్యతతో నిర్మించాలన్నారు.
పెండింగ్ పనుల పూర్తికి అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని, నిర్మాణ సమయంలో ఎదురయ్యే సమస్యలను సకాలంలో పరిష్కరించుకోవాలని ఆదేశించారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
కలెక్టర్ వెంట వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఎం.డి. సులేమాన్, ఇంజినీరింగ్ అధికారి సుధాకర్‌రెడ్డి, వైద్య కళాశాలకు చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారు.