CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 27 October 2026, 10:03 pm Posted by : CHAITHANYA GALAM NEWS

పంటల మార్పిడితో రైతులకు ఆర్థిక ప్రయోజనాలు

  • ఖేతి బచావో అభియాన్‌పై అవగాహన.. ఏడీఏ జగదీష్‌రెడ్డి

మిర్యాలగూడ, అక్టోబర్‌ 27 (చైతన్యగళం):

ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా రైతులు పంటల మార్పిడి విధానాన్ని అలవర్చుకోవాలని మిర్యాలగూడ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు కె. జగదీష్‌రెడ్డి సూచించారు. యాసంగి సీజన్‌లో వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించాలని కోరారు. మంగళవారం మిర్యాలగూడ మండలం కొత్తగూడెం రైతు వేదికలో నిర్వహించిన ప్రత్యేక రైతు నేస్తం కార్యక్రమంలో రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆర్థికాభివృద్ధి అవకాశాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు, రైతు సంఘాల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతులకు ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ కార్యక్రమాలపై విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

ఖేతి బచావో అభియాన్‌లో భాగంగా యాసంగిలో వరి సాగుకు బదులుగా పెసర, మినుము, నువ్వులు, వేరుశనగతోపాటు ఇతర పప్పుధాన్యాలు, కూరగాయల సాగును ప్రోత్సహించాలని తెలిపారు. పంటల మార్పిడిపై గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమాన్ని డిసెంబర్‌ 15 వరకు కొనసాగించాలని పేర్కొన్నారు.

రైతులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందేలా ఫార్మర్‌ రిజిస్ట్రీ నమోదును వంద శాతం పూర్తి చేయాలని జగదీష్‌రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం అధికారులు, సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి, పంటల మార్పిడి ప్రోత్సాహం, రైతు సంఘాల ఆర్థిక బలోపేతమే లక్ష్యంగా అందరూ సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మేకల ఋషేంద్రమణి, కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి, నూకల వేణుగోపాల్‌రెడ్డి, రైతు సంఘం అధ్యక్షుడు, సర్పంచ్‌ పి.సి.కె. ప్రసాద్‌, రైతులు జె. మోహన్‌రెడ్డి, నాగిరెడ్డి, నర్సింహారెడ్డి, మిర్యాలగూడ, ఆలగడప ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యదర్శులు సతీష్‌, పి. నాగయ్య, ఐకేపీ సీసీ ప్రవీణ్‌రెడ్డి, ఐలాపూర్‌, కిష్టాపూర్‌ రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులు వెంకన్న, రవి, ఎస్. వెంకటపాల్‌రెడ్డి, ఏఈఓలు ఎం. రమేష్‌, ఎన్. నాగయ్య, ఆర్. పార్వతి తదితరులు పాల్గొన్నారు.